‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’ | YS Jagan Strong Reply To TDP Over Polavaram In AP Assembly | Sakshi
Sakshi News home page

‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’

Jul 19 2019 10:21 AM | Updated on Jul 19 2019 3:58 PM

YS Jagan Strong Reply To TDP Over Polavaram In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనసభను తన స్వార్ధం కోసం వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన స్కామ్‌లన్నీ త్వరలోనే బయటకు వస్తాయని.. వాటన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. పోలవరంపై సభలో టీడీపీ రాద్ధాంతం చేయడంపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పోలవరంపై టీడీపీ సభ్యులు ఎందుకంత రాద్ధాంతం చేస్తారు?. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత మూడు రోజులుగా నీటిపారుదల శాఖ మంతి వివరణ ఇస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది.

ఇటివలే నేను పోలవరం ప్రాజెక్టును సందర్శించాను. గత ప్రభుత్వం కారణంగానే పోలవరం పనులకు అంతరాయం ఏర్పడింది. తొలుత స్పిల్‌ వేల పనులు పూర్తి చేయకుండా కాఫర్‌ డ్యామ్‌పై శ్రద్ధ పెట్టారు. దానిని కూడా మొత్తం పూర్తి చేయలేదు. కాఫర్‌ డ్యామ్‌ వల్ల గోదావరి వెడల్పు 70 శాతం తగ్గిపోయింది. మిగిలిన కొద్ది భాగం నుంచే వరద నీరు వెళ్లాల్సిన పరిస్థితి.  జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వరదలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోను నవంబర్‌ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి. 2021 వరకు పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలనేదే మా లక్ష్యం. పోలవరంపై తొలిసారిగా రివర్స్‌ టెండరిగ్‌ వెళ్తున్నాం. సబ్‌ కాంట్రాక్టర్ల ముసుగులో టీడీపీ ప్రభుత్వం తమకు నచ్చినవారికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టింది. పోలవరంపై గత ప్రభుత్వ హయంలో దారుణమైన స్కామ్‌లు జరిగాయి. ఏ పనులు కాకుండానే నవయుగ కంపెనీకి రూ. 724 కోట్లు మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇచ్చారు. నిపుణల నివేదిక ఆధారంగా ఎంత ఆదా అవుతుందో లెక్కలు తెలుతున్నాయి. ఈ మేరకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామ’ని తెలిపారు.
 

సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా పోలవరం ప్రారంభిస్తాం..
శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే.. స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలవరంపై సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు మంత్రి అనిల్‌కుమార్‌ సమాధానం చెప్పారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవం ప్రాజెక్టు కోసం చేసిందేమీ లేదని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ తెలిపారు. టీడీపీ ఖర్చు చేసిన దాని కన్నా ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి పోలవరం పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పోలవరంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష చేశారని గుర్తుచేశారు. నిర్వాసిత కుటుంబాలకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 100 శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు బాధితుల గురించి టీడీపీ ఏపీ ఆలోచించలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తాము ఆపేశామనడం సరికాదని పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై మంత్రి సమాధానం చెప్పినప్పటికీ.. టీడీపీ సభ సజావుగా సాగకుండా చేసేందుకు యత్నించారు. సభకు ఇబ్బంది కలిగించేలా నినాదాలు చేయడం ప్రారంభించారు.

టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు..
సభలో టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. ప్రాపర్‌ ఫార్మాట్‌లో వస్తే పోలవరంపై తాము చర్చిస్తామని స్పష్టం చేశారు. అయిన కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం సరికాదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement