‘బాబు తుప్పు,.. కొడుకు పప్పు’

YS Jagan Slams Chandrababu Over Mahanadu Comments - Sakshi

సాక్షి, నరసాపురం: మహానాడు పేరుతో విజయవాడలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ అబద్ధాలు, మోసాల పోటీలు జరిగాయని వైఎస్సార్‌ సీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఈ పోటీల్లో చంద్రబాబు మొదటి స్థానంలో, ఆయన కొడుకు లోకేశ్‌ రెండో స్థానంలో నిలిచారని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 176వ రోజులో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అబద్దాలు, మోసాల విషయంలో నెంబర్‌వన్‌గా నిలిచిన చంద్రబాబు ‘తుప్పు’ అని, ఆయన ముద్దుల తనయుడు లోకేశ్‌ ‘పప్పు’అని వ్యాఖ్యానించారు. అది మహానాడు కాదు. దగానాడు అని ఆయన పేర్కొన్నారు.  కుట్ర, దగా, మోసం ఎలా చేయాలో మహానాడులో చర్చించారని ఎద్దేవా చేశారు. 

ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని, పదవిని, జెండాను లాక్కొని ఆయన చావుకు కారణమయ్యారని జగన్‌ ఆరోపించారు. ఎన్టీఆర్‌ జయంతి రోజున మెడలో ఒక దండ మాత్రం వేస్తాడని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పార్టీ ప్లీనరీలో ఎవరైనా, ఆయా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తారు. కానీ టీడీపీ మహానాడు..  వైఎస్‌ జగన్‌ను తిట్టడానికే పరిమితమైందని అన్నారు. అక్కడ తిట్ల తీర్మానాలు, అబద్దాల ప్రొగ్రెస్‌ రిపోర్టులు చేశారని చురకలంటించారు.

నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేసిన టీడీపీకి విడాకులు తీసుకుని కొత్త పెళ్లి కూతురును వెతుక్కునేటప్పుడు మళ్లీ హోదా విషయం గుర్తుకొచ్చిందని వైఎస్‌ జగన్‌ అన్నారు. అబద్ధాల మహానాడులో.. తాము 600 హామీలు ఇచ్చామనీ.. వాటిలో 98 శాతం నెరవేర్చామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని, పైపెచ్చు ఇవ్వని హామీలు కూడా అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని జగన్‌ మండిపడ్డారు. నాడు హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ది నామమాత్రమేనని చెప్పి..  ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఆమోదం తెలిపారని, ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ హోదా అంటూ మాట మార్చుతున్నారని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top