ఫీ‘జులుం’ఇక సాగదు

YS Jagan Promised Free Education Facility To All  - Sakshi

సాక్షి, కడప ఎడ్యుకేషన్‌: ఉన్నత స్థానాలు అధిరోహించాలి. బంగారు భవితకు బాటలు చేయాలి. కానీ కన్నవారి కలల సాకారానికి ప్రభుత్వ కళాశాలలు అంతగా లేవు. అరకొరగా  ఉన్నా వాటిలో కూడా అధ్యాపకుల కొరతతోపాటు మౌలిక వసతుల కొరత వేధిస్తున్నాయి.  ఈ రెండింటి  సమస్యల నడుమ ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న  విద్యార్థులు నలిగిపోవాల్సిందే. ఈ వ్యవహారమంతా ప్రభుత్వానికి  తెలిసినా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యానికి మేలు చేకూర్చేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ కళాశాలల్లోని సమస్యలను పరిష్కరించడంలో అంతగా చొరవ చూపడం లేదంటూ మేధావులు, విద్యావంతులు తçప్పుబడుతున్నారు. వీటన్నింటిని గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలను ఆశ్రయిస్తే దానిని వారు అదనుగా తీసుకుని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు రకరకాల కోర్సుల పేరుతో అడ్డు అదుపు లేకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఫీజుల భారం మోయలేక  ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకోవాల్సిన పరిస్థితి  ఏర్పడింది.

అధిక ఫీజుల భారంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో పడి మానసిక వేదనతో విలవిల్లాడుతున్నారు. పిల్లలను చదివించలేకపోతున్న పేదల వేదనను ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన ఆయన కార్పొరేట్‌ ఫీజులను క్రమబద్ధీకరించే  వ్యవస్థను తీసుకొస్తానని ప్రకటించారు. అందుకు కమిషన్‌ను నియమించి నేరుగా ముఖ్యమంత్రికి నివేదికను అప్పగించే నియంత్రణ వ్యవస్థను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఫీజులను తగ్గించడమే కాకుండా కళాశాలలకు మెరుగైన వసతుల కల్పనకు రెగ్యులేటర్‌ కమిషన్‌ద్వారా తానే సమీక్షిస్తానంటూ ప్రకటించడంపై పేద, మధ్య తరగతి కుంటుబాలతోపాటు మేధావులు, సామాన్యులు సైతం హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. 

ప్రైవేటు, కార్పొరేట్‌లో ఫీజులుం ఇలా ... 
జిల్లాలో 80కి పైగా  ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు ఇంటర్‌ విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరిపై ప్రైవేటు, కార్పొరేట్‌  కళాశాలల యాజమాన్యం వివిధ రకాల కోర్సుల పేరుతో  ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నారు. జిల్లా పరిధిలోని పలు కార్పొరేట్‌ కళాశాలల్లో ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీసీ 18 వేలు, ఏఐఈఈఈ ఐసీ బ్యాచ్‌ రూ. 24 వేలు, జెడ్‌ఎఫ్‌టీసీకి రూ. 32, బైపీసీ నీట్‌ ఐసీ బ్యాచ్‌ రూ. 24 స్పార్కు బ్యాచ్‌ 32,  ఐఐటి స్పార్క్‌ రూ. 60 వేలు, ఎన్‌వన్‌ 20 బ్యాచ్‌ రూ. 25 వేలు, నీట్‌ 40 వేలు, నీట్‌ ఎన్‌40 బ్యాచ్‌కు 80 వేలు ఇలా ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో  ఎంపీసీ, బైపీసీలకు సంబంధించి రూ. 12 వేల నుంచి 18 వేల వరకు ఉన్నాయి.

ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫీజులకు కళ్లెం
ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కార్‌ ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రోత్సహించడంతో ఫీజుల దోపిడీకి నియంత్రణ లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రైవేట్‌ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయం.


– రాహుల్, ప్రొద్దుటూరు.

పేదలకు ఊరట
ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చాలా మంచి నిర్ణయం. ప్రస్తుతం విద్యావ్యవస్థ కార్పొరేట్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకటో తరగతికి రూ.80వేలు పైనే ఫీజులు ఉన్న పాఠశాలలు ప్రతి పట్టణంలోనూ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలామంది పల్లెలలో చిన్నారులను చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్‌ జగన్‌ నిర్ణయం ఇలాంటి వారికి ఊరట కలిగిస్తుంది.


– సుకన్య, బద్వేలు 

ప్రభుత్వ బడులు నిర్వీర్యం
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి. గత నాలుగేళ్లలో జిల్లాలో 500కు పైగా పాఠశాలలు మూత పడ్డాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో చాలామంది ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చేరుతున్నారు. ఇలాంటి దుస్థితి మారుస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటన చేశారు. నిర్వీర్యమైన పాఠశాలలకు తిరిగి పునర్జీవం వస్తుంది.


– పవిత్ర, మామిళ్లపల్లె, కలసపాడు మండలం

విద్య వ్యాపారంగా మారింది... 
నేటి సమాజంలో విద్య వ్యాపారంగా మారింది. అడ్మిషన్‌ ఫీజు, పుస్తకాలు, స్టడీమెటీరియల్, రికార్డులు వీటితోపాటు ఫీజులను ఇలా పలు రకాల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేస్తామనటం అభినందనీయం. 


– అంబటి, రాజశేఖర్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లె, కడప. 

అందరికీ అందుబాటులో విద్య...
ప్రస్తుత తరుణంలో కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల భారం మోయలేని విధంగా తయారైంది. తల్లిదండ్రులు కార్పొరేట్‌ మోజులో పడి అప్పులు చేసి చదివిస్తున్నారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కార్పొరేట్‌ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్‌ ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీని నియమిస్తామనటంతో అందరికీ విద్య అందుబాటులోకి వస్తుంది.
 
– చెంచిరెడ్డి, రిటైర్డు హెడ్‌మాస్టర్‌

జగన్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాం 
ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటను మేము స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న కార్పొరేట్‌ విద్యా వ్యవస్థ స్థానంలో కామన్‌ విద్యా విధానం తీసుకరావాలి. అప్పుడు మాత్రమే సామాన్యలు తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించడానికి వీలుంటుంది. 

– ఖాజారహ్మతుల్లా, వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు.  

చదువు మీది..భరోసా మాది..! 
వైవీయూ : పేదరికం కారణంగా ఫీజులు చెల్లించలేక ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కావద్దని దివంగత ముఖ్యమంత్రి డాక్టర వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా లక్షలాది విద్యార్థులు ఉన్నతవిద్యకు నోచుకోగా.. ఆయన మరణానంతరం ఈ పథకాన్ని పాలకులు క్రమేణా నీరుగార్చారు. ప్రస్తుత ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో సెమిస్టర్‌కు 75 శాతం ఉండాలని పేర్కొనగా.. ప్రస్తుతం ప్రతినెలా 75 శాతం హాజరు ఉండాలంటూ ఇలా రకరకాల నిబంధనలు పెట్టడం వలన విద్యార్థులు చాలా మంది ఈ పథకానికి దూరమవుతున్నారు.

జననేత జగన్‌ హామీతో..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులు పడుతున్న బాధలు విన్నారు.. మీకు నేను ఉన్నానంటూ వారికి ఫీజుల భారం తగ్గిస్తామని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ పథకాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో సైతం చేర్చి తన నిబద్ధతను చాటుకున్నారు.ఈ నిర్ణయం పట్ల విద్యార్థిలోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

వైఎస్‌ఆర్‌ హయాంలో..
దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసే సమయంలో పేద విద్యార్థుల కష్టాలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత, సాంకేతిక విద్య చేరువై లక్షలాది మంది విద్యార్థులు వైద్యులుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా రాణించారు.

టీడీపీ పాలనలో..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిబంధనలతో కోత పెట్టారు. మరోవైపు కళాశాలలకు ఫీజులు పెంచడానికి అనుమతులిచ్చేశారు. లక్షల్లో ఫీజు ఉంటే వేలల్లో మంజూరు చేస్తుండటంతో మిగిలిన భారం విద్యార్థులపై పడుతోంది.

వైఎస్‌ జగన్‌ వాగ్దానమిదీ..
పేద విద్యార్థుల చదువుకు పూర్తి ఖర్చు భరిస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. నవరత్నాల్లో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కళాశాల ఫీజుతో పాటు భోజనం, వసతి కోసం రూ.20వేలు ఇస్తామన్నారు. జగన్‌ మాటిస్తే తప్పరని, అన్నమాటపై భరోసా ఉంటుందని విద్యార్థి లోకం విశ్వసిస్తోంది. 

కొండంత భరోసా..
విద్యార్థులకు ఉన్నత చదువును అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తామని జగనన్న ప్రకటించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు వసతి, భోజనం కోసం రూ.20 వేలు ఇస్తామనడం గొప్ప నిర్ణయం. దీని వలన పేద విద్యార్థులందరూ కూడా ఉన్నతవిద్యవైపు వస్తారు.

– ఎం. అరుంధతి, ఎంఎస్సీ జెనిటిక్స్‌ అండ్‌ జీనోమిక్స్, వైవీయూ

భవిష్యత్‌పై ఆశలు..
పేద విద్యార్థులు ఉన్నతవిద్య సులువుగా చదువుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ సరిగా రాక ఇబ్బందులు పడ్డాం. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం మా భవిష్యత్‌పై ఆశలు నిలుపుతోంది. – ఎస్‌. గురువయ్య, పీజీ విద్యార్థి, బద్వేలు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top