నవ యుగానికి నాంది

YS Jagan Mohan Reddy release ysrcp manifesto  - Sakshi

పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

మా ఎన్నికల ప్రణాళికనుమనసా వాచా కర్మణా అమలు చేస్తాం.. 

పార్టీ వెబ్‌సైట్‌లో ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది 

ఇందులో ఒక్క అబద్ధమూ ఉండదు.. ఒక్క మోసం కూడా ఉండదు 

హామీలు అమలు చేసి.. 2024లో ప్రజలను గర్వంగా ఓట్లు అడుగుతాం  మేనిఫెస్టోలోని మెజారిటీ అంశాలు నవరత్నాల్లోనివే... 

ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలను ప్రభుత్వం మోసం చేసినట్లే లెక్క 

2014 టీడీపీ మేనిఫెస్టోలో  చంద్రబాబు 650 హామీలిచ్చాడు 

ఐదేళ్ల పాలనలో ఒక్కటి కూడా అమలు చేయలేదు 

 ప్రజలు చొక్కా పట్టుకుంటారన్నభయంతో ఆ మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేశాడు

మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర పత్రం. తాముఅధికారంలోకి వస్తే ఫలానా పని చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోవడానికి మేనిఫెస్టోను ప్రతి పార్టీ విడుదల చేస్తుంది. అధికారంలోకి వచ్చాక ఆ పనులు చేయకపోతేఆ ప్రభుత్వం మోసం చేసినట్లు కాదా? మేనిఫెస్టోలోచెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి, మళ్లీ ఎన్నికల్లోఓట్లు అడగాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది.
– వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ–2019 ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో) ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి, కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని, దీన్ని తాము మనసా వాచా కర్మణా అమలు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే శీర్షికతో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా రూపొందించిన వైఎస్సార్‌సీపీ–2019 ఎన్నికల మేనిఫెస్టోను ఆయన ఉగాది పర్వదినాన శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉగాది శుభదినాన పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడితే అది మోసమే అవుతుందన్నారు. విలేకరుల సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే... ‘‘రాష్ట్రంలో ఒక కొత్త యుగానికి, కొత్త అధ్యాయానికి ఈ రోజు నాంది పలుకుతున్నాం. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను మా వెబ్‌సైట్‌లో నుంచి తీసేయడం అనేది ఉండదు. ప్రతిరోజూ ప్రజలందరికీ కనిపించేలా అందుబాటులో ఉంటుంది. దీనిపై ప్రతిరోజూ సమీక్ష చేసుకుంటాం. మనసా వాచా కర్మణా ఈ మేనిఫెస్టోను అమలు చేస్తాం. ఇందులో ఇచ్చిన హామీలు అమలు చేశాక, ఇవన్నీ మేం చేశాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని 2024 ఎన్నికల్లో ప్రజలను గర్వంగా ఓట్లు అడుగుతాం. మా ఎన్నికల ప్రణాళికలో ఒక్క అబద్ధమూ ఉండదు, ఒక్క మోసం కూడా ఉండదు. ఇందులో ఉన్న మెజారిటీ అంశాలు నవరత్నాల్లోనివే. నవరత్నాలే కాకుండా పాదయాత్రలో నేను ప్రజలకు ఇచ్చిన హామీలు, మా పార్టీ బీసీ డిక్లరేషన్‌లోని అంశాలు, మా నేతలు అధ్యయనం చేసి ఇచ్చిన సిఫార్సులు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. 

మేనిఫెస్టో.. పవిత్రమైన పత్రం 
ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టోను పుస్తకం రూపంలోనో... పత్రం రూపంలోనో విడుదల చేస్తుంది. అందులో వందల పేజీలు పెడుతుంది. ప్రతి కులానికీ ఒక పేజీ పెట్టి పంపిణీ చేస్తారు. కానీ, ఆ తరువాత జరిగేదేమిటి? గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో గురించి కూడా ఈరోజు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర పత్రం. తాము అధికారంలోకి వస్తే ఫలానా పని చేస్తామని చెప్పి, ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి హామీలతో ప్రతి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. ప్రజలతో ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక ఆ పనులు చేయకపోతే ఆ ప్రభుత్వం మోసం చేసినట్లు కాదా? ఎన్నికల్లో నెగ్గడానికి మేనిఫెస్టోను తీసుకొచ్చి, అందులోని హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం జరక్కూడదు. మేనిఫెస్టోను ఐదేళ్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచి, అందులో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి, మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. 

టీడీపీ మేనిఫెస్టోను మాయం చేశారు 
మా పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పే ముందు 2014లో చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోను చూపించక తప్పదు. (2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపిస్తూ..) చంద్రబాబు ఇంత లావు పుస్తకం విడుదల చేశాడు. ఇందులో ప్రతి కులానికీ ఒక పేజీ కేటాయించాడు. దాదాపు 650 హామీలు ఇచ్చాడు. ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడుంది? అని తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లో వెతికితే కనిపించదు. టీడీపీ మేనిఫెస్టోను కనిపించకుండా చేశారు. కారణం ఏమిటంటే ఆ మేనిఫెస్టోలోని హామీలను ప్రజలు గమనించి, చంద్రబాబు చొక్కా పట్టుకుంటారేమోనని భయం. ప్రజలను మోసం చేయడానికే మేనిఫెస్టోలు తెస్తున్నారా? లేక ఇందులోని ప్రతి హామీని అమలు చేశామని చెప్పుకుని, గర్వంగా ఓట్లడిగే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో తెస్తున్నారా? 

ప్రతి కులానికీ హామీలిచ్చాడు  
2014లో చంద్రబాబు నాయుడు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాడు. వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ, చేనేత కార్మికుల రుణాలు మాఫీ, మద్యం బెల్టు దుకాణాల రద్దు, మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థ, యువతకు ఉద్యోగం, ఉపాధి.. రెండూ ఇవ్వకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, చిన్న పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌.. ఇలా చదువుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఎస్సీలుగానో, ఎస్టీలుగానో మారుస్తామంటూ ప్రతి కులానికీ హామీలిచ్చారు. 

మళ్లీ ప్రజల చెవుల్లో పువ్వులు 
ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తే.. అది సామాన్య ప్రజలకు ఐదేళ్లపాటు అందుబాటులో ఉండాలి. ఆ పార్టీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీట నొక్కితే మేనిఫెస్టో కనిపించాలి. ఈ మేనిఫెస్టోలో నువ్వు ఫలానా హామీలిచ్చావు, వాటిని ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు ప్రశ్నించే విధంగా ఉండాలి. అప్పుడే దాన్ని మేనిఫెస్టో అంటారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు మళ్లీ ఇప్పుడు విలేకరుల సమావేశం నిర్వహిస్తాడు. 2019 మేనిఫెస్టో అంటూ ఒక అందమైన ఫొటో పెట్టి పుస్తకం విడుదల చేస్తాడు. మళ్లీ ప్రజల చెవుల్లో పువ్వులు పెడతాడు. ఇలా చేయడం సరైందేనా? అని ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రశ్నించాలి. చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడనే దానిపై ప్రధానంగా మూడు అంశాలు చెబుతాను. 

బాబు ఇచ్చిన సొమ్ము వడ్డీలకు కూడా చాల్లేదు 
పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. కానీ, ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్న సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు ఇప్పుడు పసుపు–కుంకుమ అంటూ మహిళలను మోసం చేస్తున్నాడు. గతంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేవారు. 2016 మే నెల నుంచి సున్నా వడ్డీకే అక్కచెల్లెమ్మలకు రుణాలు ఇచ్చే విధానాన్ని చంద్రబాబు పూర్తిగా రద్దు చేశాడు. అప్పటి నుంచి సున్నా వడ్డీ పథకానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డ్వాక్రా సంఘాలు ఎక్కువగా బ్యాంకుల నుంచి రూ.5 లక్షలు, రూ.7 లక్షలు, రూ.10 లక్షలు రుణాలుగా తీసుకుంటాయి. రూ.5 లక్షలు తీసుకుంటే వడ్డీ 12 శాతం అనుకున్నా ప్రతి ఏటా అయ్యే వడ్డీ రూ.60 వేలు. రూ.7 లక్షలకు ఏడాదికి అయ్యే వడ్డీ రూ.84 వేలు. 10 లక్షలకు ఏడాదికి అయ్యే వడ్డీ రూ.1.20 లక్షలు. సున్నా వడ్డీకే రుణాల పథకం మూడేళ్ల క్రితమే రద్దు కావడంతో ఒక్కో డ్వాక్రా సంఘం తీసుకున్న రుణాలపై ఈ మేరకు వడ్డీ భారం పడుతోంది. రూ.5 లక్షలు రుణం తీసుకుంటే మూడేళ్లకు రూ.1.80 లక్షలు, రూ.7 లక్షలు రుణం తీసుకుంటే రూ.2.52 లక్షలు, రూ.10 లక్షలు రుణం తీసుకుంటే రూ.3.60 లక్షల వడ్డీ భారం పడింది. సున్నా వడ్డీకే రుణాల పథకాన్ని రద్దు చేసి, డ్వాక్రా సంఘాలపై వడ్డీల భారం మోపిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు పసుపు–కుంకుమ కింద ఒక్కో సంఘానికి చెల్లిస్తున్న సొమ్ము కేవలం రూ.లక్ష మాత్రమే. అంటే ఎన్నికల ముందు ఇస్తున్న ఈ సొమ్ము డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలకు కూడా సరిపోలేదు. ఇది మోసం కాదా? అని అడుగుతున్నా. ఇలాంటి మోసాలు చేస్తున్న వాళ్లు నిజంగా మనుషులేనా? 

రైతు రుణమాఫీ కింద ఇచ్చింది రూ.14 వేల కోట్లే 
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) ఇచ్చిన నివేదిక ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏపీలో రైతుల రుణాలు రూ.87,612 కోట్లు ఉన్నాయి. ఆ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఐదేళ్ల చంద్రబాబు పాలన తరువాత రూ.87,612 రుణాలు వడ్డీలతో కలిపి తడిసిమోపెడై ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు తొలి సంతకం కింద రైతుల రుణ మాఫీ కోసం పెట్టింది రూ.24,500 కోట్లు. అదైనా పూర్తిగా ఇచ్చాడా అని చూస్తే ఇచ్చింది కూడా లేదు. నిన్న మొన్నటి వరకూ ఇచ్చింది కేవలం రూ.14 వేల కోట్లు. అంటే సంవత్సరానికి రూ.4 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి మళ్లీ డ్రామా ఆడుతున్నాడు. రుణమాఫీ కోసం నాలుగో విడత, ఐదో విడత అంటూ మళ్లీ ఇవాళ రైతుల ఖాతాల్లో రూ.8 వేల కోట్లు వేసే ప్రయత్నం చేస్తున్నాడు.  

రైతన్నలను దారుణంగా మోసం చేశారు 
వడ్డీలతో కలిపి రైతులు చెల్లించాల్సింది రూ1.50 లక్షల కోట్లు అయితే చంద్రబాబు ఐదేళ్లకు కలిపి కేవలం రూ.14 వేల కోట్లు ఇచ్చాడు. బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న మొత్తం బంగారాన్ని విడిపిస్తానని చంద్రబాబు స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడేమో ఆ బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక  రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీకి రుణాల పథకాన్ని రద్దు చేసేశారు. అంటే రూ.87,612 కోట్ల రుణాలపై కనీసం వడ్డీ డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఈ రుణాలపై వడ్డీ సంవత్సరానికి రూ.7 వేల కోట్లకు పైగానే అవుతుంది. ఐదేళ్లకు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు అవుతుంది. ఈ భారం మొత్తం రైతులు భరించాల్సిందే. కానీ, రుణమాఫీ కింద చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చింది కేవలం రూ.14 వేల కోట్లు. అంటే రుణమాఫీ పేరిట చంద్రబాబు ఇచ్చిన సొమ్ము అసలు రుణాలపై వడ్డీలకు కూడా చాల్లేదు. గత ప్రభుత్వాల మాదిరిగా సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చి ఉంటే రైతులపై రూ.40 వేల కోట్ల వడ్డీ భారం పడేది కాదు. అన్నదాతలను ఇంత దారుణంగా మోసం చేయడం ధర్మమేనా? 

ప్రజల భవిష్యత్తుకు బాధ్యత వహించడం ఇలాగేనా? 
ప్రతి ఇంటికీ ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని, లేకపోతే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్లు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఎన్నికలు వచ్చేసరికి మరో డ్రామా మొదలుపెట్టాడు. రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లు ఉండగా, వాటిని చంద్రబాబు 3 లక్షలకు తగ్గించేశాడు. ఆయా కుటుంబాలకు నిరుద్యోగ భృతి కింద రూ.వెయ్యి మాత్రమే ఇచ్చాడు. నెలకు రూ.2 వేల చొప్పున ఐదేళ్లకు గాను రూ.1.20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటిదాకా మూడు నెలలకు మొత్తం రూ.3 వేలు మాత్రమే ఇచ్చాడు. పైగా నిరుద్యోగ భృతి బ్రహ్మాండంగా ఇచ్చాను, నన్ను గుర్తు పెట్టుకోండి అంటున్నాడు. మీ భవిష్యత్తు–నా బాధ్యత అంటూ మాట్లాడుతున్నాడు.

ప్రజల భవిష్యత్తుకు బాధ్యత వహించడం ఇలాగేనా? ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశాక ప్రజల భవిష్యత్తు ఎలా ఉందో అర్థమవుతోంది. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టో ఎక్కడుందోనని ఆ పార్టీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెతకండి, మీకు కనిపిస్తే చెప్పండి. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఎన్ని అమలు చేశాడో మీరే ఆలోచించండి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ఇంత లావు పుస్తకం కానే కాదు. సంగ్రహంగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్‌ నేతలు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, దాసరి జైరమేశ్, పొట్లూరి వీరప్రసాద్, బుట్టా రేణుక, వి.ఖాదర్‌బాషా, నందిగామ సురేష్, మేరుగ నాగార్జున, డి.కృష్ణ, జంగా కృష్ణమూర్తి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అడుసుమిల్లి జయప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top