కేరళ నుంచి రాహుల్‌ పోటీ ఎందుకు?

Why Rahul Gandhi Contesting From Kerala - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అంశంపై నెలకొన్న సస్పెన్స్‌ ఆదివారం నాడు తొలగిపోయింది. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచే కాకుండా కేరళలోని వయనాడ్‌ నుంచి  కూడా పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. వయనాడ్‌లో రాహుల్‌కు వ్యతిరేకంగా లెఫ్ట్‌నెంట్‌ డెమోక్రటిక్‌ అభ్యర్థిగా సీపీఐ నాయకుడు పీపీ సునీర్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ మిత్రపక్షమైన భారత ధర్మ జన సేన అభ్యర్థిగా వీవీ పెయిలీ పోటీ చేస్తున్నప్పటికీ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, ఎల్‌డీఎఫ్‌ మధ్యనే ఉంటుంది.

కేరళ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని మార్చి 23వ తేదీనే కేరళ కాంగ్రెస్‌ నాయకులు సూచనప్రాయంగా తెలిపారు. కేరళ కాంగ్రెస్‌ నాయకుల కోరిక మేరకు వాయనాడ్‌ నుంచి పోటీ చేసేందుకు రాహుల్‌ గాంధీ సుముఖత వ్యక్తం చేయడంతో ముందుగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థి టీ. సిద్ధిక్‌ను తప్పించారు. కేరళ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారా, లేదా? అన్న అంశంపై వారం రోజులపాటు సందిగ్ధత కొనసాగడంతో కేరళ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో వెనకబడి పోయింది. ఇప్పటికే ఎల్‌డీఎఫ్‌ కేరళలో మొదటి రౌండ్‌ ప్రచారాన్ని ముగించింది.

కేరళ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేయడం వల్ల కేరళ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుందని, ముఖ్యంగా మైనారిటీలైన ముస్లింల ఓట్లు పడతాయని కేరళ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టామ్‌ వడక్కన్‌ మార్చి 14వ తేదీన బీజేపీలో చేరడంతో మరికొంత మంది కాంగ్రెస్‌ నాయకులు బీజేపీలోకి క్యూ కడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో రాహుల్‌ రాక పార్టీకి బలన్ని ఇవ్వడంతోపాటు బీజేపీకి పోతాయనుకున్న అగ్రవర్ణాల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి పడే అవకాశం ఉందని కూడా నాయకులు భావిస్తున్నారు.

కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో వాయనాడ్‌ ఉందికనుక, అక్కడి నుంచి పోటీ చేస్తే మూడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించినట్లు ఉంటుందన్న కారణంగా అక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా ఈ మూడు రాష్ట్రాల కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీని కోరారు. రాహుల్‌ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయడం తమకెంతో గౌరవప్రదమైన విషయమని కేరళ కాంగ్రెస్‌ చీఫ్‌ ముల్లపల్లి రామచంద్రన్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీకి వాయనాడ్‌ సురక్షితమైన సీటు. ఈ నియోజకవర్గం ఏర్పడిన  2009 నుంచి రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ అభ్యర్థియే విజయం సాధించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top