
పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యను బూచిగా చూపి ప్రచారానికి వెళ్లవలసిన తమను...
సాక్షి, వైఎస్సార్ : పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యను బూచిగా చూపి ప్రచారానికి వెళ్లవలసిన తమను అడ్డుకోవడం దారుణమని, మంత్రి ఆదినారాయణరెడ్డికి తామంటే ఎందుకంత భయమని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో జరగవలసిన ప్రచారాన్ని అడ్డుకోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము మూడు రోజుల క్రితమే సున్నపురాళ్లపల్లికి వెళ్లేందుకు అనుమతి కోరామని తెలిపారు. మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు ఇప్పుడు వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థిగా తాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా సుధీర్ రెడ్డి వెళ్లడానికి హక్కు ఉందన్నారు.
ఆదినారాయణరెడ్డి పులివెందుల వస్తే తాము, తమ కార్యకర్తలు ఏ రోజూ అడ్డుకోలేదని చెప్పారు. గతంలోనూ ఇదే విధంగా అడ్డుకుంటే కోర్టు అనుమతితో ప్రచారానికి వెళ్ళామని గుర్తుచేశారు. జమ్మలమడుగు ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. దీనికి భయపడే తమను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరడ్డుకున్నా తాము శాంతియుతంగా ఆ గ్రామానికి వెళ్లి తీరతామని స్పష్టం చేశారు.