అన్నా.. ఎవరు గెలుస్తరే?

Which Party Is Going To Win In Telangana Assembly Elections - Sakshi

ఏ నలుగురు కలిసినా ఎన్నికల ఫలితాలపైనే చర్చ 

గెలుపోటములపై వాదోపవాదాలు

కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారంటూ ఊహాగానాలు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం

కూటమి గెలిచే అవకాశం ఉన్నా.. చంద్రబాబు ప్రవేశంతో దెబ్బ 

సంక్షేమ పథకాల లబ్ధిదారులే గెలిపిస్తారన్నది టీఆర్‌ఎస్‌ ఆశ 

లక్ష ఉద్యోగాలు, ఉచిత సిలిండర్లపై ఆశ పెట్టుకున్న కాంగ్రెస్‌ 

భీమవరం, రైల్వేకోడూరు, ముంబైలో భారీగా బెట్టింగ్‌లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముందెన్నడూ లేని ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య కూడళ్లు, రెస్టారెంట్లు, టీ సెంటర్లు, గ్రామాల్లో రచ్చబండలు ఇలా ఎక్కడ ఏ నలుగురు కలిసినా తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటములపైనే చర్చ. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసి ఎన్నికలకు వెళ్తున్న చంద్రశేఖర్‌రావు.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీల కూటమి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్‌2న టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రగతి నివేదన సభ తర్వాత ఆ పార్టీ ప్రతిష్ట కొంత మసకబారినట్లు అనిపించినా కొద్ది రోజులకే మార్పు కనిపించింది. ఈ ఏడాది మే, జూన్‌ల్లో కాంగ్రెస్‌ పుంజుకుంటున్న వాతావరణం కనిపించినా.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించడంతోనే టీఆర్‌ఎస్‌ బలపడుతున్న సంకేతాలు కనిపించాయి. దానికి తోడు కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం నామినేషన్ల గడువు ముగిసేదాకా తేలకపోవడం కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపించింది.  

టీడీపీతో పొత్తు..  
కాంగ్రెస్‌కు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజికవర్గానికి టీడీపీతో పొత్తు రుచించలేదు. దీంతో ఈ సామాజికవర్గంలో కొంత మేర చీలిక వచ్చి టీఆర్‌ఎస్‌కు ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘అసెంబ్లీ రద్దు అయ్యే నాటికి ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌కు ఎన్నికలకు ముందున్న ఎజెండా సంక్షేమ పథకాలు.. కానీ కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం టీఆర్‌ఎస్‌ ఎజెండానే మార్చేసింది. టీడీపీతో కాంగ్రెస్‌ ఎప్పుడు జత కలిసిందో అప్పుడే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు చంద్రబాబు రూపంలో ఎన్నికల ప్రచారానికి సెంటిమెంట్‌ అస్త్రం మరోసారి కలిసొచ్చింది. దీన్ని అంత తేలిగ్గా తీసిపారేయలేం’అని ఓ రాజకీయ విశ్లేషకుడు పేర్కొన్నారు. 

సెటిలర్లంతా బాబును బలపరుస్తారా? 
ఏపీ సెటిలర్లందరూ టీడీపీని బలపరుస్తారన్న తప్పుడు అంచనాతో కాంగ్రెస్‌ తన గొయ్యి తనే తవ్వుకుందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. గత టీఆర్‌ఎస్‌ పాలనలో సెటిలర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత టీఆర్‌ఎస్‌కు కలసివస్తాయని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ద్వారా కాంగ్రెస్‌ ఒకే ఒక సామాజికవర్గం ఓట్లలో మాత్రమే 60 నుంచి 70 శాతం మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉందని, ఇది టీఆర్‌ఎస్‌ విజయావకాశాలను ఎంత మాత్రం దెబ్బతీయదని పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అదీ టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా నివసించే అమీర్‌పేటలో నిర్వహించిన కూటమి సభకు హాజరైన జనం 2,500 నుంచి 3 వేల వరకు ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు. తెలంగాణలో స్థిరత్వం కోరుకుంటున్న ఏపీ సెటిలర్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని, ఇది కాంగ్రెస్‌కు మింగుడుపడని వ్యవహారమని రాజధానికి చెందిన ఓ కాంగ్రెస్‌ నేత ఆందోళన వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు.. అయితే 
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఎక్కడ చర్చ జరిగినా సీఎంగా కేసీఆర్‌కే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో చాలా మందిపై వ్యతిరేకత ఉందని, అది పార్టీ విజయావకాశాలపై ప్రబావం చూపొచ్చని పేర్కొంటున్నారు. టీఆర్‌ఎస్‌ మాత్రం వంద శాతం విజయం సాధిస్తామని, సంక్షేమ ఫలితాలు పొందిన వారిలో 80 శాతం మంది తమకే ఓటేస్తారని విశ్వసిస్తోంది. కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా, గడచిన నాలుగేళ్ల పాలనలో తాము అందించిన సంక్షేమ పథకాల ఫలాల కంటే అవేమీ గొప్ప కాదని, పైగా బహు నాయకత్వం ఉన్న కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో నమ్మకం లేదని టీఆర్‌ఎస్‌ అంటోంది. కాంగ్రెస్‌ మాత్రం ఏడాదిలో లక్ష ఉద్యోగాలతో యువత, పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడం ద్వారా ఉద్యోగులు, ఏడాదిలో ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడమన్న హామీతో మహిళల ఆదరణ ఉంటుందని, గట్టెక్కుతామని నమ్మకంతో ఉంది. 

జోరుగా బెట్టింగులు 
తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బెట్టింగ్‌లు జోరందుకుంటున్నాయి. ఏపీలో భీమవరం, రైల్వేకోడూరు, మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా బెట్టింగులు సాగుతున్నాయి. భీమవరం కేంద్రంగా ఇప్పటికే వందల కోట్లలో బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ‘15 రోజుల కింద దాకా టీఆర్‌ఎస్‌ 50 దాటదు అన్న బెట్టింగ్‌ ఎక్కువగా నడిచింది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు 60 దాటొచ్చు అన్న దానిపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కూటమికి ఒక దశలో 50 సీట్లు దాటుతాయన్న బెట్టింగ్‌లు ఎక్కువగా నడిచినా, ఇప్పుడు 40 దాటుతుందన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు’అని భీమవరం కేంద్రంగా నడుస్తున్న ఓ బెట్టింగ్‌ నిర్వాహకుడు చెప్పారు. వచ్చే నెల 2–5 తేదీల మధ్య బెట్టింగ్‌ల్లో మార్పులు ఉంటాయని, అప్పుడు స్పష్టత వస్తుందని చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top