తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు: లక్ష్మణ్‌

We Will Form Government In Telangana In 2019 Says BJP Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌​ : జన చైతన్యయాత్రతో రాష్ట్రం మొత్తం పర్యటించి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తామని తెలంగాణ  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌  అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి.. ప్రజల ముందు కాంగ్రెస్‌ను, టీఆర్‌ఎస్‌ను దోషిగా నిలబెడతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని విషప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు రెండూ కూడా మజ్లిస్‌తో అంటకాగిన పార్టీలేనని, తాము ఎవరితో రహస్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొత్తం కుటుంబ పాలనగా సాగుతోందని.. బీసీలను కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు మోసం చేశాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, వారికి ద్రోహం చేశాయని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మోసపూరిత చర్యలను ప్రజల ముందు ఎండగడతామన్నారు. కేంద్రం ఇచ్చే పంచాయతీ నిధులను ఖర్చు చేయకుండా తాత్సారం చేస్తోందన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. శనివారం నుంచి తెలంగాణలో బీజేపీ జన చైతన్యయాత్ర ప్రారంభం కానుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top