90% ముస్లిం ఓట్లు పడేలా చూడండి

Viral video shows Kamal Nath seeking 90% Muslim votes - Sakshi

కాంగ్రెస్‌ నేతలకు కమల్‌నాథ్‌ సూచన

వైరల్‌గా మారిన వీడియో

చర్యల కోసం ఈసీకి బీజేపీ వినతి

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్‌ ఇబ్బందుల్లో పడ్డారు. ఈసారి మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో 90 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చేయాలని ఆ పార్టీ ముస్లిం నేతలను కమల్‌నాథ్‌ కోరుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో గత నెలలో రికార్డు చేసినట్లు భావిస్తున్న ఈ వీడియోలో ‘నరేంద్ర మోదీకి ఓటు వేయడమంటే హిందువులకు ఓటేయడమేనని బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రజలకు సందేశాన్ని పంపుతున్నాయి. నిజంగా ముస్లింలకు ఓటేయాలని మీకు ఉంటే కాంగ్రెస్‌కు ఓటేయండి.

వాళ్లు మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. కానీ పోలింగ్‌ అయ్యేంతవరకూ ఓపిక పట్టండి. గత ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటింగ్‌ సరళిని ఓసారి గమనించాలని మిమ్మల్ని కోరుతున్నా. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కేవలం 50–60 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. 90% పోలింగ్‌ ఎందుకు జరగలేదు? ఒకవేళ ముస్లింలు ఈ ఎన్నికల్లో 90 శాతం ఓటు హక్కును వినియోగించుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో మతం ఆధారంగా ఓట్లడిగిన కమల్‌నాథ్‌ తో పాటు కాంగ్రెస్‌ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ నేతృత్వంలో బీజేపీ బృందం ఎన్నికల సంఘానికి వినతిపత్రాన్ని సమర్పించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top