
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తన కక్ష సాధింపు చర్యలకు కేంద్రం సహకరించకపోవడంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లోని పలు అంశాలను ప్రస్తావించారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పింది అక్షర సత్యం. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏదో ఒక నేరం మోపి అరెస్ట్ చేయండని కేంద్రంపై ఒత్తిడి చేశారు. రాష్ట్ర సమస్యలు, నిధులపై చర్చ లేదు. వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడితే తామెలా చేస్తామని కేంద్రం స్పష్టం చేయడంతో.. చంద్రబాబు కాంగ్రెస్సే నయమని అటువైపు జారిపోయార’ని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రజలు అప్‌డేట్ అయిన చంద్రబాబు అదే భ్రమలో ఉన్నారు..
మరో ట్వీట్‌లో చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చెప్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని అభిప్రాయపడ్డారు. ‘1980-90ల కాలంలో పత్రికల్లో ఏది వచ్చినా ప్రజలు నమ్మేవారు ఆ తర్వాత మీడియా విస్తృతి పెరుగుతూ వచ్చింది. రకరకాల సమాచారం వస్తుంటే నిజమేదో, అబద్ధమేదో తెలిసిపోతుంది. ప్రజలు అప్‌డేట్ అయినా పాపం చంద్రబాబు, ఆయన కుల మీడియా తాము ఏది వదిలినా ప్రజలు దానినే విశ్వసిస్తారనే భ్రమలో ఉన్నార’ని తెలిపారు.