రూపానీ ప్రమాణం

Vijay Rupani sworn in as Chief Minister of Gujarat - Sakshi

ఉపముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్, మరో 18 మంది ప్రమాణ స్వీకారం

గాంధీనగర్‌: వరుసగా రెండోసారి విజయ్‌ రూపానీ గుజరాత్‌ పీఠం అధిష్టించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రూపానీతో గవర్నర్‌ ఓపీ కోహ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణం చేశారు. వీరిలో నితిన్‌ పటేల్‌ సహా 9 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.. మిగతా 10 మంది సహాయ మంత్రులు. మంత్రివర్గంలో పటేల్, ఓబీసీ వర్గాలకు చెరో ఆరు పదవులు దక్కగా.. ముగ్గురు క్షత్రియ, ఇద్దరు ఎస్టీ, ఒకరు బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ఉన్నారు. సీఎంగా రూపానీ ప్రమాణస్వీకారం అనంతరం..వరుసగా కేబినెట్, సహాయ మంత్రుల ప్రమాణస్వీకారం కొనసాగింది.

బీజేపీ శాసన సభా పక్షం ఉపనేతగా ఎన్నికైన నితిన్‌ పటేల్‌ డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. భావ్‌నగర్‌ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న విభావరి బెన్‌ దవే ఒక్కరే మహిళా మంత్రి. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘2001, 2002, 2007, 2012ల నాటి ప్రమాణస్వీకారోత్సవాల్ని ఈ రోజు కార్యక్రమం గుర్తుకు తెచ్చింది’ అని అన్నారు.  ‘మోదీ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే ఇక గుజరాత్‌లో బీజేపీ రాదని కొందరు భావించారు. బీజేపీ దాదాపు 50 శాతం ఓట్లను సాధించడం గొప్ప విషయం’ అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలనే ఆహ్వానించారని, అందుకు నిరసనగా కార్యక్రమానికి గైర్హాజరయ్యామని కాంగ్రెస్‌ ప్రతినిధి మనీశ్‌ దోషి చెప్పారు. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నేడు జై రామ్‌ ఠాకూర్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top