‘నిరుద్యోగ భృతి రూ. 3 వేలు’

Uttam Kumar Reddy Declared Rahul Gandhi Tour Successfully Completed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో ముందస్తు ఎన్నిలు జరిగినా సిద్ధంగా ఉండాలని, ఈ లోపు టికెట్ల కేటాయింపు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోమని రాహుల్‌ గాంధీ సూచించారన్నారు. పొత్తులపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

రాహుల్‌ పర్యటన విజయవంతం
తెలంగాణలో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. అందువల్ల పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారని.. రాహుల​గాంధీ పర్యటన విజయవంతం అయ్యిందని ప్రకటించారు. రాహుల్ మాట్లాడి 24 గంటలు కూడా గడవకముందే ప్రభుత్వం మహిళల కోసం 970 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది రాహుల్‌ పర్యటన ఫలితమేనని తెలిపారు. విభజన బిల్లులో ఉన్న హామీలన్ని నెరవేరే విధంగా ముందుకు పోతాం అని రాహుల్ హామీ ఇచ్చారని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన టెలి కాన్ఫరెన్స్‌పై రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. మరో వారంలోనే రాహుల్‌ ఢిల్లీ నుంచి 31, 656 బూత్ అధ్యక్షులతో మాట్లాడతారని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశం కూడా విజయవంతంగా ముగిసిందని ప్రకటించారు. సరూర్ నగర్‌లో రాహుల్ ప్రసంగం అద్భుతంగా సాగిందంటూ కొనియాడారు. మీడియాతో కూడా మంచి ఇంటరాక్షన్ అయ్యిందన్నారు. రాహుల్ పర్యటనలో సహకరించిన మీడియాకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

నిరుద్యోగ భృతి రూ. 3 వేలు
సరూర్‌ నగర్‌ సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగంలో చర్చించిన అంశాలన్ని తమ మ్యానిఫెస్టోలో చేరుస్తామని ఉత్తమ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని, అలానే పెన్షన్‌ వయసును 65 నుండి 58 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారు. అంతేకాక  ఇప్పుడు 1500 రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను 3000 రూపాయలకు, 1000 రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను 2000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారు.

రాష్ట్రంలో మొత్తం15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి  రాగానే 10 లక్షల నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. కేటీఆర్ చిన్న పిల్లగాడు.. అమెరికా నుండి వచ్చి రాష్ట్రాన్ని దోచుకోవచ్చని అనుకుంటున్నాడని విమర్శించారు.

హైదరాబాద్‌లో సభ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా : కుంతియా
హైదరాబాద్‌లో సభ  పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదు.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జీ కుంతియా ప్రశ్నించారు. వచ్చే పర్యటనలో అయిన రాహుల్‌కు ఓయూలోకి వెళ్లడానికి పర్మిషన్  ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి హైదరాబాద్‌ పర్యటన సందర్భంగాల గతంలో కన్నా ఇప్పుడు ఘనమైన స్వాగతం లభించిందని పేర్కొన్నారు. రాహుల్ ఎవరికో భయపడే వ్యక్తి కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top