
సాక్షి, హైదరాబాద్: ఐటీ మంత్రి కే తారకరామారావు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే.. తాను, తన కుటుంబసభ్యులు రాజకీయాల తప్పుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కేటీఆర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, కేసీఆర్, కవిత, హరీష్ రావు కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ బుధవారం గద్వాల బహిరంగ సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషాల పురిటిగడ్డ అయిన నడిగడ్డ నుంచి సవాలు చేస్తున్నా. మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఉత్తమ్‌కుమార్! నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా’అని సవాల్ విసిరారు.
ఈ సవాల్‌పై ఉత్తమ్‌కుమార్ రెడ్డి గురువారం స్పందించారు. 'కేటీఆర్ విసిరిన సవాల్‌కు నేను కట్టుబడి ఉన్నాను. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే.. నేను, నా కుటుంబసభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటాం. నేను, నా భార్య ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలుగుతాం. మీకు (కేటీఆర్‌కు), మీకుటుంబసభ్యులకు కూడా ఇదే వర్తిస్తుంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే హరీశ్‌రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత రాజకీయాల్లోనుంచి తప్పుకోవాలి. ఎన్నికలు 2018లో వచ్చినా.. 2019 లో వచ్చినా కాంగ్రెస్ అందుకు సిద్ధమే. 100 సీట్లు రాకుంటే కేసీఆర్ ఏమంటాడు? రాజకీయంలో కేటీఆర్ ఓ బచ్చా. రాహుల్ గాంధీ మూడోసారి ఎంపీగా పూర్తి చేసుకున్నారు. అయినా ఏ పదవి అడగలేదు. కమిషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న మీరు గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేయడం విడ్డురంగా ఉంది' అని ఉత్తమ్ మండిపడ్డారు.