అమరావతి బాండ్లు కొన్నదెవరు?

Undavalli Aruna Kumar comments on Amaravati bonds - Sakshi

     ఆ తొమ్మిది మంది పేర్లు బయటపెట్టాలి 

     మాజీ ఎంపీ ఉండవల్లి డిమాండ్‌

సాక్షి, రాజమహేంద్రవరం: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన అమరావతి బాండ్లను కొన్న తొమ్మిది మంది పేర్లు బయటపెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. రాజధాని కోసం అధిక వడ్డీకి బాండ్లు జారీచేయడం దారుణమన్నారు. అప్పు చేసిన రూ.2 వేల కోట్లకు ప్రతి మూడు నెలలకొకసారి 10.36 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉందని, పైగా బ్రోకర్‌కు రూ.17 కోట్లు కమీషన్‌ ఇవ్వడం మరీ విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పైగా దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బయట పెట్టకపోవడాన్ని పారదర్శకత అంటారా? అని ప్రశ్నించారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిక వడ్డీకి అప్పు చేయవద్దని ఏడు నెలల క్రితం జీవో జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అధిక వడ్డీకి బాండ్లు జారీచేయడం ఏమిటని ఉండవల్లి ప్రశ్నించారు.

గతంలో మర్చంట్‌ బ్యాంకుగా ఉండేందుకు రూపాయి జీతం తీసుకుంటామని ఏకే కేపిటల్‌ పేరుతో వచ్చిన వ్యక్తికే ఇప్పుడు రూ.17 కోట్లు బ్రోకరేజీ ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో విజన్‌ 2020 రూపొందించిన సీఎం చంద్రబాబు సలహాదారు మెకన్సీ.. ప్రస్తుతం చికాగో జైలులో ఉన్నారని ఉండవల్లి గుర్తుచేశారు. ప్రభుత్వం మద్యాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూడడం దారుణమన్నారు. చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ బాటిల్‌ రూ.50కి విక్రయిస్తున్నారని.. అయితే దీని తయారీ, ప్యాకింగ్, రవాణాకు రూ.8.50 అవుతోందని.. షాపు వాళ్లకు రూ.3.75 ఆదాయం ఇస్తుండగా మిగిలిన రూ.37.75లు ప్రభుత్వానికి చేరుతోందన్నారు.

నిజాలు చెప్పి పాలన చేయగలరా? 
రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.2,25,234 కోట్లు ఉందని ఉండవల్లి చెబుతూ.. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన అప్పు రూ.1.30లక్షల కోట్లని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏం చేశారని నిలదీశారు. ప్రస్తుతం పెట్రోలు ధర రూ.85 ఉండగా, మనకు రూ.32లకు వస్తోందని, కేంద్రానికి రూ.19 పన్ను రూపంలో పోతుండగా, మిగతా మొత్తం రాష్ట్రానికి వెళ్తోందని వివరించారు. పెట్రోలు కొట్టించుకున్న తర్వాత వినియోగదారులకు ఇచ్చే బిల్లులో ఈ వివరాలు కేరళలో పొందుపరుస్తారని, మన రాష్ట్రంలో ఇలా నిజాలు చెప్పి పాలన చేయగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ వాళ్లు ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ అనే పుస్తకాన్ని ముద్రించారని.. అప్పట్లోనే దానిపై చర్చకు రమ్మని లోక్‌సభలో ఎర్రన్నాయుడ్ని అడిగానని ఉండవల్లి గుర్తుచేశారు. ఇవాల్టికీ తాను అందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్‌ విసిరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top