‘ఆవిర్భావ దినోత్సవం కాదు.. బ్లాక్‌ డే’

TS Congress Leaders Protest Over Police Arrest In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ : ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాల్‌ వద్ద చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ కోమటిరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కృషి చేసింది కాంగ్రెస్‌ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మేధావిలా మాట్లాడుతున్న కేసీఆర్‌ ఒక నియంత అని దుయ్యబట్టారు. కాగా మంగళవారం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు జలదీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. (ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి)

సొంత జిల్లాకు వెళ్లకుండా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడాన్ని కోమటిరెడ్డి ఖండించారు. ‘ముఖ్యమంత్రి కావాలనే నేతలను అవమానపరుస్తున్నారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం కాదు బ్లాక్ డే’ అంటూ విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. కరోనా నిబంధనల పేరుతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. దేవరకొండ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంలేదని, కేసీఆర్ హిట్లర్ కంటే ఎక్కువ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘ఆ రోజు చెప్పాం.. ఈ రోజు సాధించుకున్నాం​’)

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరిన కేసీఆర్‌కు కనీసం కనికరం లేకుండా పోయిందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద వేలమంది ఉండొచ్చు.. కానీ ముగ్గురం సీనియర్ నాయకులం ఒక్కదగ్గర ఉంటే కేసీఆర్ కి ఎందుకు భయం అని నిలదీశారు. కేసీఆర్‌కు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే భయం వేస్తుందని, కేసీఆర్ నిర్లక్ష్యం,అసమర్థత వల్లే ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని  విమర్శించారు. కేసీఆర్ అవినీతిని  ప్రజల్లోకి తీసుకుపోతామని, కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారని ఉత్తమ్‌ ఆరోపించారు. (‘సీఎం కేసీఆర్‌ కొత్త కుట్ర ప్రారంభించారు’)

పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జానారెడ్డి అన్నారు. దేవరకొండ ప్రాంతలో పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం కోసం వెళ్తుంటే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పార్టీ పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన చేయాలని అనుకుంటే అడ్డుకోవడం సరికాదన్నారు.  ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విదంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు చేస్తే ప్రత్యేక రాష్ట్ర సాధన జరిగేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ది చెబుతామని, గాంధీ భవన్ లో సీనియర్ నాయకులతో చర్చించి తమ కార్యచన చెబుతామని జానారెడ్డి పేర్కొన్నారు. (ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది?: ఉత్తమ్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top