‘పరిషత్‌’పై పరేషాన్‌!

TRS Worried About ZP Election Results - Sakshi

అధికార టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం

‘ఎంపీ’ ఓట్ల సంఖ్య తగ్గడంతో గుబులు

ప్రాదేశికంలోనూ ఇదే తీరు ఉంటుందేమోననే బెంగ

జెడ్పీ పీఠంపై కాంగ్రెస్‌లో చిగురిస్తున్న ఆశలు

నాలుగు జెడ్పీటీసీల్లో పాగా వేస్తామని కమలం ధీమా

ప్రాదేశిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థుల్లో గుబులుమొదలైంది. తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొన్ని పార్టీల్లో ఆశలు పెంచగా, మరికొన్నింటిలో మాత్రం నిరాశను మిగిల్చాయి. మొన్నటి అసెంబ్లీ నుంచి లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఓటరు నాడీ మారింది. ఆయా శాసనసభ సెగ్మెంట్ల పరిధిలో కొన్ని పార్టీలు గణనీయంగా ఓటర్ల సంఖ్యను పెంచుకోగా.. ఇంకొన్ని స్థానాల్లో అదే స్థాయిలో కోల్పోయాయి.ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ పార్టీల నేతల్లో కలవరం పుట్టిస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడు విడతలుగా జరిగిన ప్రాదేశిక పోరులో ఓటర్లు ఎటు వైపు జై కొట్టారో అంచనా వేయడంలో నేతలు తలమునకలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా తీర్పు ఉండనుందా.. లేదంటే లోక్‌సభ తరహాలో ఓట్ల బదలాయింపు జరిగిందా? అనే అంశాలపై విస్తృత స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. దీని ద్వారా జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానంపై ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాలో 248 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ స్థానాలకు మూడు దశల్లో ఈ నెల 6, 10, 14 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం జూలై మొదటి వారంలో జరిగే ఓట్ల లెక్కింపుతో తేలనుంది. పోలింగ్‌ అనంతరం అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు వేసుకొని తమదే గెలుపు అని ధీమాగా ఉన్నారు. అభ్యర్థులు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడని వరకు విజయంపై ఎవరికి వారు భరోసాగా ఉన్నారు. అయితే, లోక్‌సభ ఫలితాల వెల్లడితో ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్‌ రేసుల్లో ఉన్న ఆశావహులు మళ్లీ తమ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి.. తమకు అధ్యక్ష యోగం ఉందా లేదా అని పునః సమీక్షలోపడ్డారు. 

ఆందోళనలో గులాబీ నేతలు
అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్‌ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ గెలుపొందినప్పటికీ ఓట్ల శాతం భారీగా తగ్గింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి స్వల్ప ఓట్లతో నెగ్గారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన ఐదు నెలల్లోనే జిల్లాలో టీఆర్‌ఎస్‌కు అమాంతంగా ఓట్ల సంఖ్య పడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అంతఃర్మథనంలో పడ్డాయి. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా ఓటర్లకు టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉన్న వ్యతిరేకత వెల్లడైంది. ఇదే వ్యతిరేకత పరిషత్‌ ఎన్నికల్లో ఉందా లేదా అనే అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. లోక్‌సభ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ భారీగా ఓట్లను కోల్పోయింది. వీటి పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోనూ ఓటర్లు ఇదే తీర్పునకు కట్టుబడి ఉంటారా.. లేదా అని టీఆర్‌ఎస్‌ శ్రేణులు లెక్కలు వేస్తున్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే అనుకున్న స్థాయిలో పరిషత్‌లు దక్కకపోవచ్చన్న ఆందోళన నెలకొంది. 

హస్తంలో కొంత ఉత్సాహం
అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంత బలపడినట్లు తెలుస్తోంది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌కు మెజార్టీ రావడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇబ్రహీంపట్నంలో 8 వేల పైచిలుకు, చేవెళ్లలో ఇంచుమించు 16 వేల ఆధిక్యం రావడంతో స్థానిక సంస్థల ఫలితాలపై ఈ పార్టీలో అంచనాలు పెరిగాయి. లోక్‌సభ మాదిరిగా ట్రెండ్‌ కొనసాగితే జెడ్పీ స్థానం తమదేనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే, షాద్‌నగర్, కల్వకుర్తిలో మాత్రం పరిస్థితి కొంతమేర దిగిజారిపోయింది.  

కమలదళంలో నూతనోత్తేజం
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కొండంత బలాన్నిచ్చాయి. ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓట్ల సంఖ్య పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలపై ఆ పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. కనీసం నాలుగు జెడ్పీటీసీల్లోనైనా నెగ్గుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్‌లో గణనీయంగా ఓటు బ్యాంకును పెంచుకుంది. ముఖ్యంగా షాద్‌నగర్‌ సెగ్మెంట్‌లో అసెంబ్లీతో పోల్చితే ఏకంగా 35 వేల ఓట్లు అధికంగా ఈ పార్టీకి దక్కడం విశేషం. అయితే, మరోపక్క కల్వకుర్తిలో గణనీయంగా ఓట్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 62 శాతం ఓట్లను పోగొట్టుకుంది.

జూలై మొదటి వారంలో ఫలితాలు!
మండల, జిల్లా పరిషత్‌ ఓట్ల లెక్కింపు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 27న జరగాల్సి ఉంది. రాజకీయ పార్టీల నాయకుల అభ్యర్థన మేరకు లెక్కింపును వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జూలై మొదటి వారంలో పరిషత్‌ ఓట్ల లెక్కిపు నిర్వహించనున్నట్లు తెలిసింది. కానీ తేదీని మాత్రం అ«ధికారికంగా ప్రకటించలేదు. అయితే, లెక్కింపును వాయిదా వేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఉత్కంఠ  మరింత పెరిగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top