టీఆర్‌ఎస్‌ ఐడియా...సోషల్‌ మీడియా! | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఐడియా...సోషల్‌ మీడియా!

Published Fri, Jul 12 2019 7:53 AM

TRS to set up special social media team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలు, ప్రభుత్వంపై వస్తున్న అసత్య వార్తలను తిప్పికొట్టడంతో పాటు.. ప్రభుత్వం, పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక పంథా అవలంబించాలని నిర్ణయించింది. సమాచారం చేరవేతలో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. కార్యకర్తలు, నేతలు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. యువజన, విద్యార్థి విభాగాలతో పాటు క్రియాశీలక నేతలను గుర్తించి, వారికి సామాజిక మాధ్యమాలపై అవగాహన కల్పించనున్నారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి కీలక నేతలతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, పలు అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు, పార్టీ అభిమానులు కూడా సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు, వివిధ వర్గాల నుంచి వచ్చే అనుకూల, వ్యతిరేక పోస్ట్‌లపై స్పందిస్తున్నారు. 

వ్యతిరేక ప్రచారంపై ‘సోషల్‌’ అస్త్రం 
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్‌ వ్యతిరేక వార్తలను బీజేపీకి అనుకూలంగా ఉన్నవారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారనే భావన టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉంది. పార్టీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య, అర్ధ సత్య వార్తలతో నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేందుకు ప్రయోగాత్మకంగా మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలకు 2 రోజుల కింద పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చొరవతో జరిగిన ఈ కార్యక్రమంలో సోషల్‌ మీడియా వినియోగంపై అవగాహన కల్పించారు. సామాజిక ఖాతాల నిర్వహణలో సాంకేతిక అంశాలతో పాటు, న్యాయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని స్పందించాలని వారికి సూచించారు. 

ఇతర నియోజకవర్గాల్లోనూ.. 
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 200 మంది చురుకైన యువజన, విద్యార్థి విభాగాలకు చెందిన కార్యకర్తలతో పాటు క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో కొనసాగుతున్న సోషల్‌ మీడియా కమిటీలను కూడా వ్యవస్థీకరించి.. మరింత మందికి చోటు కల్పించాలనే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు. సోషల్‌ మీడియాపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి.. నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా షెడ్యూలు రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. ‘తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలనలోనూ తనదైన ముద్ర వేస్తోంది. కొన్ని టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులు పనిగట్టుకుని ప్రభుత్వ పనితీరుపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాం’అని బాల్క సుమన్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు.   

Advertisement
Advertisement