ఎంపీ బండి సంజయ్‌పై ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

ఎంపీ బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ఎంపీల ఫిర్యాదు

Published Thu, Jul 4 2019 12:42 PM

TRS MPs Complaint On MP Bandi Sanjay To Lok Sabha Speaker - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యల మీద టీఆర్‌ఎస్‌ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలు ఉన్నాయని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎంపీ సంజయ్‌కు సూచించారు.

కాగా లోక్‌సభలో జీరో అవర్‌ చర్చలో భాగంగా తెలంగాణ ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ బుధవారం ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం కేసీఆర్‌ విద్యను కేవలం వ్యాపార దృక్పథంతో చూస్తూ.. అనుభవం లేని గ్లోబరీనా వంటి సంస్థకు ఫలితాల విడుదలు చేసే బాధ్యతను అప్పగించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 3 లక్షలమంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పెద్దింట్లో చనిపోయిన వారిని పరామర్శించేందుకు సమయం ఉండే ముఖ్యమంత్రికి.. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదా అని ఘాటు విమర్శలు చేశారు.

చదవండి : పెద్దింటి వారిని పరామర్శిస్తారు కానీ..

Advertisement
Advertisement