అందుకే గవర్నర్‌ను కలిశాం: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

TRS MLAS Comment AT RajBhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తాజా ఎన్నికల్లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి.. పార్టీ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను అందజేశారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్,  కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీంద్ర నాయక్ తదితరులు ఉన్నారు.

టీఆర్ఎస్ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను గవర్నర్‌కు అందజేశామని తెలిపిన ఎమ్మెల్యేలు.. పరిచయం కోసం మాత్రమే గవర్నర్‌ను కలిశామంటూ.. తాము గవర్నర్‌ను కలువడంలో ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. మరోవైపు కొత్తగా కొలువుదీరనున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తిగా మారింది. కొత్త మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. వీరు గవర్నర్‌ను కలువడం కూడా ఊహాగానాలకు తావిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top