సీనియారిటీ కన్నా సిన్సియారిటీ మిన్న

TRS leaders slam Uttam Kumar Reddy - Sakshi

కేటీఆర్‌పై ఉత్తమ్‌ విమర్శలకు టీఆర్‌ఎస్‌ నేతల జవాబు

ఎంపీ సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నేతలు మాటల దాడికి దిగారు. బచ్చా అంటూ కేటీఆర్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. ఉత్తమ్‌ వంటి సీనియర్‌ అవినీతి నేతల కంటే కేటీఆర్‌ లాంటి నిజాయితీ గల నాయకులే ప్రజలకు ముఖ్యమని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాములు నాయక్, శంభీపూర్‌ రాజు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.  

అవినీతిలో ఉత్తమ్‌కు సీనియారిటీ: కిశోర్‌  
అవినీతి రాజకీయాలకు పాల్పడటంలోనే ఉత్తమ్‌కు సీనియారిటీ ఉందని గ్యాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉత్తమ్‌ అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. కేటీఆర్‌ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడని, అవినీతికి పాల్పడటం, ఆ సొమ్ముతో ఓట్లు దండుకోవడం కాంగ్రెస్‌ నేతలకే సాధ్యమని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామన్నారు. కేటీఆర్‌తో ఏ అంశంలోనైనా ఉత్తమ్‌ సరితూగుతాడా.. అని ప్రశ్నించారు. సబ్జెక్టు సిద్ధంగా లేదని అసెంబ్లీలో చర్చ నుంచి పారిపోయిన వ్యక్తి ఉత్తమ్‌ అని ఎద్దేవా చేశారు. పిచ్చి ప్రేలాపనలు చేయకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉత్తమ్‌ మాట్లాడాలని కిశోర్‌ హెచ్చరించారు.  

ఉత్తమ్‌ కల్లు తాగిన కోతి: ప్రభాకర్‌రెడ్డి
కల్లు తాగిన కోతిలాగా ఉత్తమ్‌ వ్యవహరిస్తున్నారని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఫేస్‌బుక్‌ లైవ్‌ల పేరిట ఫాల్తు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌ ‘కంటివెలుగు’లో కళ్లు పరీక్షించుకుంటే సర్కార్‌ చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌ వంటి నేత ఉండటం దురదృష్టమన్నారు. గుడ్డిగా మాట్లాడుతున్న ఉత్తమ్‌కు ప్రజలే గడ్డిపెడ్తారని హెచ్చరించారు. నిప్పులాంటి కేటీఆర్‌తో చెలగాటం మంచిది కాదని చెప్పారు.

వ్యక్తిత్వంలో కేటీఆర్‌ హిమాలయమంతటి ఎత్తు: మనోహర్‌రెడ్డి
కేటీఆర్‌ వయసులో చిన్నవాడైనా వ్యక్తిత్వంలో హిమాలయమంత ఎత్తున్నవాడని దాసరి మనోహర్‌రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేటీఆర్‌ ఎంత కష్టపడుతున్నారో ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్‌పై అనవసర విమర్శలు చేసి ఉత్తమ్‌ స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. కేటీఆర్‌పై విమర్శలు చేస్తే  బుద్ధి చెప్తామని  హెచ్చరించారు.  

వయసులో బచ్చానే..నిలో అచ్చా: రాములు నాయక్‌
కేటీఆర్‌ వయసులో బచ్చానే అయినా మంత్రిగా పనితీరులో అచ్చా అని ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అన్నారు. అమెరికాలో బంగారంలాంటి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్‌ పాల్గొన్నారని గుర్తు చేశారు. సంక్షేమకార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే ముందున్నదని పేర్కొన్నారు. ప్రజల్లో తిరగకుండా గాంధీభవన్‌లో కూర్చుని కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌పార్టీతో ఏ వర్గమూ లేదన్నారు. తెలంగాణకు రాహుల్‌గాంధీ వెయ్యిసార్లు వచ్చినా కేసీఆర్‌ను సీఎం కాకుండా ఆపలేరని రాములు నాయక్‌ అన్నారు. కుటుంబపాలన గురించి మాట్లాడేముందు ఉత్తమ్‌ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ అవినీతిమయం: బాల్క సుమన్‌
కాంగ్రెస్‌ నేతలందరూ అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని బాల్క సుమన్‌ అన్నారు. రాహుల్‌గాంధీ అబద్ధాల గురించి చెప్తే, ‘తేలు కుట్టిన దొంగల్లా’గా కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో సీనియారిటీ కన్నా సిన్సియారిటీ ముఖ్యమని, కేటీఆర్‌కు సీనియారిటీ లేకున్నా సిన్సియారిటీ ఉందన్నారు.

పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు.. అవినీతిపరుడైన ఉత్తమ్‌కు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని సుమన్‌ విమర్శించారు. ఎన్నికలప్పుడు ఉత్తమ్‌ కారులోనే రూ.3 కోట్లను కాల్చివేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి సాధించడం, ప్రపంచ యవనిక మీద హైదరాబాద్‌ చిత్రపటాన్ని నిలబెట్టడం కేటీఆర్‌ వల్లనే సాధ్యమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవడానికే ఉత్తమ్‌ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

రాహుల్‌ ఒక బచ్చా: తలసాని
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక బచ్చా అని, అతని నాయకత్వంలో పనిచేస్తున్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి...కేటీఆర్‌ను బచ్చా అనే అర్హత లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. సోమవారం  విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదన్నారు.

కేటీఆర్‌కు రాజకీయ అనుభవం లేదని మాట్లాడే నీకు రాజకీయాల్లో ఏం అనుభవం ఉందని పీసీసీ అధ్యక్ష పదవిని వెలగబెడుతున్నావని ఎద్దేవా చేశారు. కన్ను కొట్టడం, పార్లమెంటులో ప్రధానమంత్రిని ఆలింగనం చేసుకోవడం వంటి రాహుల్‌ పిల్ల చేష్టలను దేశం మొత్తం చూస్తోందన్నారు. మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో పరిశ్రమలు, ఐటీరంగం అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top