చంద్రబాబు అడుగుపెడితే అంతే మరి

TRS Huge Majority In Chandrababu Campaign Segments - Sakshi

15 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం.. 12 చోట్ల ఓటమి

ఆయన రాకతో నిండా మునిగిపోయిన కూటమి అభ్యర్థులు

టీఆర్‌ఎస్‌లో విభేదాల వల్లే ఖమ్మం జిల్లాలో టీడీపీకి రెండు స్థానాలు  

సాక్షి, అమరావతి: చంద్రబాబు వచ్చి ప్రచారం చేస్తే తమపై ఓట్ల వర్షం కురుస్తుందని, బంపర్‌ మెజారిటీలు వచ్చేస్తాయని మురిసిపోయిన తెలంగాణ ప్రజా కూటమి అభ్యర్థులకు గట్టి షాక్‌ తగిలింది. బాబు ప్రచారం చేసిన చోట కూటమి గల్లంతైంది. ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభలు నిర్వహించగా, 12 చోట్ల కూటమి అభ్యర్థులు భారీ ఓట్ల తేడాతో పరాజయం రుచిచూశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు వారం రోజులపాటు హైదరాబాద్‌లో మకాం వేసి వ్యూహరచన చేశారు. ఖమ్మం, కోదాడ, హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌తోపాటు శివార్ల పరిధిలోని ముషీరాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మలక్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభలు నిర్వహించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని, కేసీఆర్‌ చేసిందేమీ లేదని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి గెలిచేస్తుందంటూ హడావుడి చేశారు. అయితే ఎక్కడా ఆయన పాచికలు పారలేదు.  

బాబు ప్రచారం చేసిన చోట టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ
హైదరాబాద్‌ నగరం, శివార్లలో చంద్రబాబు ప్రచారం చేసిన 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో అవమానకర ఓటమిని సొంతం చేసుకోవాల్సి వచ్చింది. కూకట్‌పల్లిలో 41 వేల ఓట్ల తేడాతో, శేరిలింగంపల్లిలో 44 వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. చంద్రబాబు ప్రచారం చేసిన రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 58 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. బాబు ప్రచారం నిర్వహించిన సికింద్రాబాద్, ముషీరాబాద్, ఉప్పల్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఊహించని మెజారిటీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్, మలక్‌పేటలో కూటమి అభ్యర్థులను చంద్రబాబు గెలిపించలేకపోయారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఒక్క ఎల్‌బీ నగర్‌లోనే కూటమి అభ్యర్థి గెలిచారు.

నల్గొండ జిల్లా కోదాడలో రాహుల్‌గాంధీతో కలిసి ప్రచారం చేసినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతిని గెలుపు తీరం చేర్చలేకపోయారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాహుల్‌గాంధీతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించలేక చంద్రబాబు చతికిలబడ్డారు. అదే జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా అది టీఆర్‌ఎస్‌లోని అంతర్గత విభేదాల వల్లే సాధ్యమైందని చెబుతున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top