‘పరిషత్‌’ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ దూకుడు

TRS Get Ready For Zilla Parishad Elections - Sakshi

ఉమ్మడి జిల్లాలో పరిశీలకుల నియామకం 

నియోజకవర్గాల వారీగా వెల్లడించిన మంత్రి దయాకర్‌ రావు

ఆరు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచన

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) దూకుడు పెంచింది. నిన్న, మొన్నటి వరకు పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమించిన గులాబీ శ్రేణులను మళ్లీ ఎన్నికలకు సంసిద్ధులను చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమై స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆరు స్థానాలను గెలుచుకోవడంతో పాటు అన్ని ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకుని విజయబావుటా ఎగురవేయాలని ఆయన టీఆర్‌ఎస్‌ నేతలకు తేల్చిచెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నిలపాలని అధినేత మార్గదర్శనం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను బుధవారం నియమించారు. ఇందులో శాసనసభ్యులతో పాటు పార్టీ ముఖ్యనేతలకు భాగస్వామ్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణులతో మమేకం కావడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి రానున్న పరిషత్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.

పరిశీలకులు వీరే...

 • భూపాలపల్లి : దాస్యం వినయ్‌భాస్కర్‌ (వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే), కన్నెబోయిన రాజయ్య యాదవ్‌
 • ములుగు : నన్నపునేని నరేందర్‌ (వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే)
 • మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధి : సీతారాంనాయక్‌ (ఎంపీ), మాలోతు కవిత (మాజీ ఎమ్మెల్యే)
 • కొత్తగూడ, గంగారం మండలాల పరిశీలన : సీతారాంనాయక్‌ (ఎంపీ)
 • బయ్యారం, గార్ల మండలాల పరిశీలన : మాలోతు కవిత (మాజీ ఎమ్మెల్యే)
 • స్టేషన్‌ ఘన్‌పూర్‌ : వాసుదేవరెడ్డి
 • వర్ధన్నపేట : మర్రి యాదవరెడ్డి
 • నర్సంపేట : గుండు సుధారాణి
 • పరకాల : పులి సారంగపాణి
 • పాలకుర్తి : జన్ను జకారియా(పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల), పరంజ్యోతి(తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర).
 • హుజూరాబాద్, హుస్నాబాద్‌ : ఎర్రబెల్లి ప్రదీప్‌రావు (కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి).
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top