నేడు సీఎల్పీ భేటీ 

Today is the CLP meeting - Sakshi

మధ్యాహ్నం 2 గంటల కల్లా అందుబాటులోకి రావాలని అభ్యర్థులకు ఆదేశం 

5 గంటలకు భేటీ.. మెజార్టీ వస్తే 12న సీఎం ప్రమాణం 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ఫలితాల అనంతరం వెంటనే గెలిచిన పార్టీ అభ్యర్థులతో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఫలితాల ప్రకటన తర్వాత గెలిచిన అభ్యర్థులందరూ 2 గంటల కల్లా అందుబాటులోకి రావాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే సమాచారం పంపారు. ఐదు గంటలకు సీఎల్పీ భేటీని గాంధీభవన్‌లో గానీ లేదా ఏదైనా ప్రైవేట్‌ హోటల్‌లో గానీ నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ భేటీలోనే సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియకు పార్టీ హైకమాండ్‌ పెద్దలు గులాంనబీ ఆజాద్‌తో పాటు మరికొందరు హాజరయ్యే అవకాశాలున్నాయి.

పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిన పక్షంలో 12నే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. 12న పంచమి కావడం ఉదయం 9 గంటలు, 11 గంటల తర్వాత మంచి ఘడియలు ఉండటంతో ఆ సమయంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేలా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ హంగ్‌ ప్రభుత్వం ఏర్పడే పక్షంలో గెలిచిన అభ్యర్థులు చేజారకుండా వారిని క్యాంపుల నిమిత్తం బెంగళూర్‌ లేక ఇతర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితో పాటు పార్టీతో కలిసొచ్చే ఇండిపెండెంట్లను క్యాంపులకు తరలించేలా ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ, పార్క్‌ హయత్‌లో 40 గదుల చొప్పున ముందే బుక్‌ చేసి ఉంచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top