ఓటమికి సాకులు అన్వేషిస్తున్న టీడీపీ

TDP Searching Silly Reasons For Losing Elections - Sakshi

అందుకే ఈవీఎంలపై ఆరోపణలు: ఉమ్మారెడ్డి

టీడీపీ ఏజెంట్లు ఎక్కడైనా కౌంటింగ్‌ను అడ్డుకుంటే కేసులు తప్పవు

చంద్రగిరిలో కట్టుదిట్టమైన భద్రతతో పోలింగ్‌ నిర్వహిస్తారని భావిస్తున్నాం

23న ఢిల్లీలో విపక్షాల భేటీకి పిలిచినా వెళ్లం

సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు ఓటమికి సాకులు అన్వేషిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఓటమి భయంతోనే ఈవీఎంలు సరిగా పని చేయడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతోపాటు కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల సంఘం పూర్తి స్థాయి బందోబస్తుతో రీ పోలింగ్‌ నిర్వహిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 23న ఓట్ల లెక్కింపు సమయంలో అనుమానాలు తలెత్తితే రీ కౌంటింగ్‌ కోరే హక్కు ఏజెంట్లకు ఉంటుందని చెప్పారు. ఓడిపోతామనే భయంతో టీడీపీ ఏజెంట్లు ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా కౌంటింగ్‌ను అడ్డుకుంటే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని స్పష్టం చేశారు.

ఏజెంట్లు కూడా సంతకాలు చేస్తేనే ఆ రౌండ్‌ పూర్తైనట్లు..
‘పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించే వారిపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండరాదు. కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంలలో ఓట్ల వివరాలు స్పష్టంగా వినిపించకపోతే ఒకటికి రెండుసార్లు సిబ్బందిని అడిగి నిర్ధారించుకోవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ ముందుగా చేపడతారు. అధికారులతోపాటు ఏజెంట్లు కూడా సంతకాలు చేస్తేనే ఆ రౌండ్‌ పూర్తి అయినట్లు గుర్తుంచుకోవాలి. కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లాక సెల్‌ఫోన్లు వాడకూడదు. ఏజెంట్లు తమ దృష్టి అంంతా కౌంటింగ్‌ పైనే కేంద్రీకరించాలి’ అని ఉమ్మారెడ్డి కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచించారు. వీవీప్యాట్‌లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేసి లెక్కించాలని సుప్రీంకోర్టు సూచించిందని గుర్తు చేశారు. ఈవీఎంలలో ఓట్లకు, వీవీప్యాట్లలో ఓట్లకు మధ్య తేడా ఉంటే అంతిమంగా వీవీప్యాట్లలోని ఓట్లనే పరిగణించాలని ఈసీ స్పష్టం చేసిందని ఉమ్మారెడ్డి వివరించారు.

సోనియా నుంచి ఆహ్వానం అందినా వెళ్లం...
ఈ సందర్భంగా విలేకరులడిగిన పలు ప్రశ్నలకు ఉమ్మారెడ్డి జవాబిస్తూ.. ‘ఈనెల 23న ఢిల్లీలో తలపెట్టిన విపక్షాల భేటీకి సోనియాగాంధీ నుంచి ఆహ్వానం అందినా మేం ఆ సమావేశానికి వెళ్లం. కూటమి పేరిట చర్చల్లో పాల్గొనాలని మాకు ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి ఆహ్వానాలు అందలేదు. ఆహ్వానం వచ్చినా మా పార్టీ ప్రతినిధులు వాటిల్లో పాల్గొనరు’ అని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top