చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఝలక్‌ | TDP MLAs And MLCs Gave Shock to Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఝలక్‌

Jan 20 2020 3:57 AM | Updated on Jan 20 2020 3:58 AM

TDP MLAs And MLCs Gave Shock to Chandrababu  - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఝలక్‌ ఇచ్చారు. విప్‌ జారీ చేసినా ఆదివారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశానికి ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు, 10 మందికి పైగా ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమరావతి పరిరక్షణ పేరుతో హడావిడి చేస్తున్న చంద్రబాబు మిగతా ప్రాంతాల ప్రయోజనాలను పట్టించుకోకపోవడం వల్లే వీరంతా అసంతృప్తికి గురై సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు, వికేంద్రీకరణపై అసెంబ్లీలో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఆదివారం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. దీనికిముందే తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ విప్‌ జారీ చేసి అసెంబ్లీలో పార్టీ వైఖరికి అనుకూలంగా వ్యవహరించాలని, ఓటింగ్‌ జరిగితే పార్టీ నిర్ణయం ప్రకారం ఓటు వేయాలని విప్‌లో పేర్కొన్నారు. పార్టీపై తిరుగుబాటు చేసిన గన్నవరం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరిధర్‌లకు సైతం విప్‌ జారీ చేశారు. ఊహించినట్టుగానే వారిద్దరూ విప్‌ను పట్టించుకోకుండా సమావేశానికి హాజరుకాలేదు. 

చంద్రబాబు వైఖరిపై అసంతృప్తే కారణం
చంద్రబాబు మినహా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు గైర్హాజరవగా అందులో విశాఖ ఉత్తరం, దక్షిణం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌ ఉద్దేశపూర్వకంగానే డుమ్మా కొట్టినట్లు చెబుతున్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటును స్వాగతించిన వీరిద్దరూ దానికి అనుకూలంగా పార్టీ తరఫున తీర్మానం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ అమరావతికి అనుకూలంగా, విశాఖకు వ్యతిరేకంగా చంద్రబాబు చేపడుతున్న కార్యకలాపాలకు మద్దతివ్వడం లేదు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కూడా అసంతృప్తితో ఉండడం వల్లే సమావేశానికి రాలేదని చెబుతున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్సీలు, మద్దతుగా ఉన్న ముగ్గురు స్వతంత్ర, ఇతర ఎమ్మెల్సీల్లో 10 మందికిపైగా సమావేశానికి రాలేదు. వారంతా వ్యక్తిగత కారణాలతో రాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు శాసనమండలికి వచ్చాక అక్కడ వాటిని తిరస్కరించేందుకు తమ పార్టీకి బలం ఉందని టీడీపీ చెబుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు సమావేశానికి డుమ్మా కొట్టడంతో చంద్రబాబుకు తీవ్ర షాక్‌ తగిలింది. 

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడ్డుకుందాం 
శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు
మూడు రాజధానులపై శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ బిల్లునైనా వ్యతిరేకించి అడ్డుకుందామని ప్రతిపక్ష నేత చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడాలని, ఓటింగ్‌ జరిగితే వ్యతిరేకించాలని సూచించారు. సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించిన బిల్లును శాసనమండలిలో వ్యతిరేకించేందుకు కావాల్సిన సంఖ్యా బలం టీడీపీకి ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఈ బిల్లును ఆర్థిక బిల్లుగా పెట్టేందుకు వీలు లేదని యనమల రామకృష్ణుడు చెప్పగా, ఒకవేళ ఆర్థిక బిల్లుగా పెడితే అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకోవాలని నిర్ణయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement