టీడీపీలో అసమ్మతి సెగలు

TDP Leaders Tickets Fight - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ అధికార టీడీపీలో టిక్కెట్ల రగడ ముదురుతోంది. పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు బల ప్రదర్శనలకు దిగుతున్నారు. తమ అసంతృప్తిని బహిరంగం వెళ్లగక్కుతున్నారు. వర్గాలుగా విడిపోయి వీధిపోరాటాలకు దిగుతున్నారు. కొందరు నేరుగా అధినేత చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు. తాటికొండలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు.

‘జగ్గంపేట’పై పీఠముడి
టీడీపీలో జగ్గంపేట సీటు వివాదం రాజుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరుతూ ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులు మంగళవారం చంద్రబాబును కలిశారు. అనారోగ్యం కారణంగా ఎంపీ స్థానానికి పోటీ చేయలేనని చంద్రబాబుకు నరసింహం తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్యకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. గతంలో జగ్గంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిశానని, ఇప్పటికి తమకు అక్కడ బలమైన కేడర్‌ ఉందని వివరించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో తమ కేడర్ ఇబ్బంది పడినా సర్దుకుపోయామని తెలిపారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది.

కొవ్వూరు టీడీపీలో కాక
పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేధాలు తారాస్దాయికి చేరుకున్నాయి. మంత్రి జవహర్‌కు టిక్కెట్ కేటాయింపుపై టీడీపీ రెండు వర్గాలగా విడిపోయింది. జవహర్‌కు టిక్కెట్ ఇస్తే పనిచేసేది లేదని కొన్ని రోజుల క్రితం అధిష్టానానికి వ్యతిరేక వర్గం తేల్చి చెప్పింది. రెండు రోజుల క్రితం మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరు‌ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించింది. దీనికి పోటీగా జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో జవహర్ అనుకూల వర్గం  వంద కార్లలో అమరావతికి బయలుదేరింది. జవహర్‌కే టిక్కెట్ కేటాయించాలంటూ చంద్రబాబును‌ కలవనుంది. వర్గపోరుతో ఇప్పటికే కొవ్వూరులో రెండు టీడీపీ కార్యాలయాలుగా కొనసాగుతోంది.


వెంకటపాలెంలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణ

శ్రావణ్‌కుమార్‌పై చెలరేగిన అసమ్మతి
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై సొంత పార్టీలోనే అసమ్మతి చెలరేగింది. వచ్చే ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్‌ ఇవ్వొద్దని, తమ మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే మాయనను ఓడిస్తామని స్థానిక టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వెంకటపాలెంలో మంగళవారం శ్రావణ్‌కుమార్‌ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. (ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దు; అమరావతిలో ఉద్రిక్తత)

టీటీడీ పదవి వద్దు
వైఎస్సార్‌ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే సీటు తన కుమారుడికి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు తన కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబును కలిశారు. తన కుమారుడికి టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవి వద్దని అధినేతకు చెప్పారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పాలకొండ రాయుడు టెన్షన్‌గా ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top