కేశవ్‌ ఇలాకాలో భూ దందా

TDP Leaders Poor People Land Grabbing In Anantapur - Sakshi

పేదల భూములపై టీడీపీ నేతల కన్ను

సాగులో లేరంటూ లాక్కునేందుకు కుట్ర

టీడీపీ నేతల ఒత్తిళ్లతో నోటీసుల జారీ

అసైన్‌మెంట్‌ కమిటీలో పట్టాలు ఇవ్వడానికి ఎత్తుగడ  

50 మంది రైతుల్లో 36 మందికి నోటీసులు జారీ   

దుక్కి చేసిన భూమిని చూపుతున్న రైతు పేరు పద్మావతి. నరసాపురం రెవెన్యూ పరిధిలోని రమణేపల్లి గ్రామం. సదరు రైతుకు సర్వే నం.334లో 4.50 ఎకరాలకు (ఎస్‌ఎస్‌ఐడీ నం–121640000900 56907) పేరుతో 2007 నవంబర్‌ 2వ తేదీ డీ పట్టా ఇచ్చారు. ఇందులో రైతు 3 బోర్లు డ్రిల్లింగ్‌ చేయించింది. ఈమెకు కూడా సాగులో లేవంటూ నోటీసులు జారీ చేశారు.

కళ్యాణదుర్గం: టీడీపీ ప్రభుత్వం పేదలకు జానెడు భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. నాలుగేళ్లుగా మాటల గారడీతో కాలం వెల్లదీశారు. ఎక్కడా ఒక ఎకరం కొని పేదలకు పంచిన పాపాన పోలేదు. పైపెచ్చు పేద రైతులపై టీడీపీ నేతలు కన్నేశారు. డీ పట్టాలు పొంది దశాబ్దాల కాలంగా పంటలు సాగు చేసుకుంటున్న కొందరు, పెట్టుబడులు పెట్టి నష్టపోయి పంట సాగు చేయడానికి ఇబ్బంది పడుతున్న మరికొంత మంది రైతుల భూములను లాక్కునేందుకు బెళుగుప్ప మండలం నరసాపురం టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. టీడీపీ పెద్దల ఒత్తిడితో పేద రైతులు సాగులో లేరంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి స్వామి భక్తి చాటుకున్నారు. 50 మంది రైతుల్లో 36 మందికి నోటీసులు ఇవ్వగా టీడీపీ సానుభూతి పరులైన 14 మందికి నోటీసులు జారీ చేయకపోవడం గమనార్హం. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ ఇలాకా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం నరసాపురం రెవెన్యూ పరిధిలో టీడీపీ నాయకులు భూ అక్రమాలకు తెరలేపారు. 

కాంగ్రెస్‌ హయాంలో 2006 నుంచి 2009 వరకు పలు విడతల భూ పంపిణీలో అప్పటి ప్రభుత్వం నరసాపురం రెవెన్యూ పరిధిలోని రమణేపల్లి, యలగలవంక, యలగలవంక తండా, నరసాపురం రైతులకు 50 మందికి భూ పంపిణీ చేపట్టింది. సుమారు 76 ఎకరాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం సాగులో లేరంటూ సర్వే నంబర్లు 186–4ఏ లో నాగమణి, 186–4ఏ, 186–7ఏలలో రాధమ్మ, సర్వే నం.57–2బీలో రామాంజినమ్మ, సర్వే నం. 186–6లో హంపమ్మ, సర్వే నం. 186–7సీ, – 9లలో టి.అనంతమ్మ, సర్వే నం.186–10లో అలివేలమ్మకు, భూలక్ష్మి, అనుసూయమ్మ, లక్ష్మిదేవి, నారాయణ, నాగమ్మ, డి.కిష్టప్పతో పాటు 36 మందికి సాగులో లేరని, ఇతర గ్రామాల్లో ఉన్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. 

టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ఎత్తుగడ
ప్రస్తుతం 36 మందికి సంబంధించిన 50 ఎకరాల భూమిని టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ఎత్తుగడ వేశారు. టీడీపీ నాయకుడు ఉమా మహేశ్వర నాయుడు, ప్రసాద్, మురళి తదితరులు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో ఒత్తిడి చేయించి, బెళుగుప్ప రెవెన్యూ అధికారులను అక్రమ మార్గంలో వెళ్లేలా చేస్తున్నారనే విమర్శలున్నాయి. త్వరలో నిర్వహించే అసైన్‌మెంట్‌ కమిటీలో సదరు టీడీపీ నేతలు తయారు చేసిన జాబితాల ఆధారంగా ఇప్పటికే పేదలు అనుభవిస్తున్న భూముల్లో పట్టాలివ్వడానికి కుట్ర జరుగుతోంది. బాధిత రైతులు శుక్రవారం కళ్యాణదుర్గం ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. 

కేశవ్‌ ఇలాకాలో భూ అక్రమాలకు తెర
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ సానుభూతిపరులకు అక్రమ మార్గాన భూ పట్టాలు ఇప్పించేందుకు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ ఇలాకాలోని బెళుగుప్ప మండలం నరసాపురం రెవెన్యూ పరిధిలో భూ అక్రమాలకు తెర లేపారు. ఎక్కడా ప్రభుత్వం డబ్బు వెచ్చించి భూమి కొనుగోలు చేయకుండానే నరసాపురం గ్రామం రెవెన్యూ పరిధిలో ఎన్నికల్లో సహకరించని పేద రైతులను టార్గెట్‌ చేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. మాట వినని వారికి నోటీసులు జారీ చేయించి టీడీపీ సానుభూతి పరులకు సంబంధించిన పూర్యానాయక్, ఉలుగూరి హనుమంతప్పతో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుతోంది. 

పరిహారం, పంట రుణం     పొందినా లాక్కునేందుకు..
నరసాపురం రెవెన్యూ పరిధిలో డీ పట్టాలు పొందిన 50 మంది రైతులు కళ్యాణదుర్గం సిండికేట్‌ బ్యాంకులో దశాబ్దాల కాలంగా పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వాల నుంచి అందే రాయితీలను కూడా పొందారు. అంతేకాదు పెద్ద క్రిష్ణానాయక్, టి.అనంతమ్మ, టి.నారాయణ, అనుసూయమ్మల పొలాలు రాయదుర్గం– తుమకూరు రైల్వే లైన్‌ ఏర్పాటు సందర్భంగా కొంత పొలాన్ని కోల్పోవడంతో పరిహారం కూడా అందింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top