బాపట్ల ఎంపీ సురేశ్‌పై టీడీపీ నేతల దాడి

TDP Leaders Attack On MP Suresh - Sakshi

ఎంపీ కారును అడ్డుకుని దుర్భాషలాడుతూ దౌర్జన్యం

ఎంపీ పీఏ, పీఎస్‌వోపైనా దాడికి తెగబడ్డ వైనం

కృష్ణా జిల్లా నందిగామలో ఘటన

ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించిన దళిత సంఘాలు

నందిగామ/పొన్నూరు/తాడేపల్లిరూరల్‌(మంగళగిరి): బాపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేశ్‌పై టీడీపీ నేతలు ఆదివారం దాడికి తెగబడ్డారు. ఆయన కారును అడ్డుకుని దౌర్జన్యం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నందిగామలో ఆదివారం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. ఎంపీ సురేశ్‌ వ్యక్తిగత పనుల నిమిత్తం నందిగామ వచ్చారు. పనులు ముగించుకున్న అనంతరం కారు ఎక్కుతున్న ఎంపీని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు, తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం.. తెలుగు నాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) నేతలు కలుసుకొని గులాబీ పూలు ఇచ్చి, అమరావతికి మద్దతు తెలపాలని కోరారు. ఎంపీ వారికి నవ్వుతూనే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఈ తరుణంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడంతోపాటు ఓవర్‌యాక్షన్‌ చేస్తూ ఎంపీపై దౌర్జన్యానికి దిగారు. ఎంపీ సురేశ్‌ అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో కారును అడ్డుకుని ఆయనపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన ఎంపీ పీఎస్‌వో విజయ్‌బాబు, పీఏ జగదీశ్‌పైన దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది రక్షణగా నిలిచి టీడీపీ నేతలను వారించడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.   జరిగిన ఘటనపై ఎంపీ సురేశ్‌ తరఫున లీగల్‌ సెల్‌ న్యాయవాది వెంకటేష్‌ శర్మ, వైఎస్సార్‌సీపీ నేతలు ఎం.కృష్ణకిరణ్, కె.నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసినట్లు నందిగామ ఎస్‌హెచ్‌వో రవికుమార్‌ తెలిపారు. టీడీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సజ్జా అజయ్‌చౌదరితోపాటు మరికొందరు ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దళిత సంఘాల మండిపాటు
ఎంపీ నందిగం సురేశ్‌పై దాడిని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపై దాడికి పాల్పడ్డ వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్‌ అమరావతి రాజధాని కమిటీ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. ఎంపీపై దాడిని ఖండిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

స్వార్థంతోనే చంద్రబాబు అమరావతి రాగం
తన రాజకీయ స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి వాసులను రెచ్చగొడుతున్నారని ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆదివారం కృష్ణా జిల్లా నందిగామకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని, అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. మూడు పంటలు పండే భూములను రాజధాని పేరుతో బీడు భూములుగా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన చంద్రబాబును పల్లెత్తు మాటనడం చేతకాని పవన్‌ కల్యాణ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించడానికి మాత్రం ముందుంటారని విమర్శించారు. జగన్‌ పాలన బాగుంటే తాను సినిమాలు చేసుకుంటానని చెప్పిన పవన్‌.. ప్రస్తుతం ఆ కారణంతోనే సినిమాల్లో నటిస్తున్నారా? అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top