సుఖేందర్‌రెడ్డి ఫిరాయింపుదారుడు....  | Sakshi
Sakshi News home page

సుఖేందర్‌రెడ్డి ఫిరాయింపుదారుడు.... 

Published Sun, Apr 22 2018 1:12 AM

Sukhendarreddy is a defector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన సుఖేందర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమని, నియామక జీవోను రద్దు చేయాలని బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఇందులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, రైతు సమన్వయ సమితి ఎండీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితోపాటు సుఖేందర్‌రెడ్డిని వ్యక్తిగతహోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ‘సుఖేందర్‌రెడ్డి  పార్లమెంట్‌ సభ్యుడిగా రాజీనామా చేయలేదు.

లోక్‌సభలో స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా కొనసాగుతూ టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాక, సమితి అధ్యక్ష పదవి లాభదాయక పోస్టు కిందకే వస్తుంది. కాబట్టి పార్లమెంట్‌ సభ్యుడిగా గుత్తాకు అనర్హత వర్తిస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సుఖేందర్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేయండి.’అని మధుసూదన్‌రెడ్డి తన పిటిషన్‌లో కోర్టును కోరారు.   

Advertisement
Advertisement