పట్టు సడలించొద్దు.. సమష్టిగా పనిచేయండి

Sonia Gandhi Directions To TPCC Cadre Work Unite - Sakshi

కాంగ్రెస్‌ నేతలకు సోనియా, రాహుల్‌ దిశానిర్దేశం

బేగంపేట ఎయిర్‌పోర్టులో ముఖ్య నేతలకు సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ.. ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే అంశంపై రాష్ట్ర పార్టీ పెద్దలకు కీలక సూచనలు చేసినట్లుగా తెలిసింది. శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం, తిరిగి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి తిరిగి ఢిల్లీ పయనమయ్యే సందర్భంలో ఆమె ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కొద్దిసేపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీలతో మాట్లాడారు.

అభ్యర్థుల ఎంపిక మొదలు, అసంతృప్త నేతలను బుజ్జగించడంలో నేతలంతా సమయస్ఫూర్తితో వ్యవహరించారని, ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించాలని సోనియా సూచించారు. ప్రచారానికి కేవలం 12 రోజులు మాత్రమే ఉన్నందున మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్‌ కుటుంబ పాలనను, ఇచ్చిన వాగ్దానాల అమలులోచేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లుగా తెలిసింది. బడుగు, బలహీన వర్గాలకు పార్టీని దగ్గర చేయాలని, నిరుద్యోగ యువతను పూర్తిగా పార్టీ వైపు మళ్లించుకునేలా వ్యూహాలు ఉండాలని చెప్పినట్టు సమాచారం. అలాగే పార్టీ ఇస్తున్న హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగుల విషయంలో పార్టీ చేపట్టే కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించినట్టు తెలిసింది. 

విజయం ఖాయం..
పార్టీ అంతర్గత సర్వేల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయంగా ఉందని, ఏమాత్రం పట్టు సడలించకుండా చివరి వరకు అప్రమత్తంగా ఉండి పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పినట్టుగా కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రజాకూటమిలోని తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితిలతో సమన్వయం చేసుకుంటూ, పరస్పర సహకార ధోరణితో పార్టీ అభ్యర్థులు గెలిచేలా సమష్టిగా కలిసి పనిచేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు సోనియా, రాహుల్‌లు సూచించినట్లుగా ఆ వర్గాలు వెల్లడించాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top