వైఎస్సార్‌సీపీలో మంత్రి సోమిరెడ్డి బావ..

Somireddy brother in law joined in YSRCP At Hyderabad - Sakshi

ఇద్దరు కుమారులతోసహా రామకోటారెడ్డి చేరిక

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్‌ జగన్‌

నెల్లూరు టీడీపీకి షాక్‌

సాక్షి, హైదరాబాద్‌: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి స్వయానా బావ అయిన కేతిరెడ్డి రామకోటారెడ్డి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. రామకోటారెడ్డి తన అనుచరులతో కలసి బుధవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలసి పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు జగన్‌ పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కోటారెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులు శశిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డికి కూడా జగన్‌ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. రామకోటారెడ్డి దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ కావలి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర నిర్వహించారు. కావలి పట్టణ టీడీపీ అధ్యక్షునిగానూ, సాగునీటి సంఘం చైర్మన్‌గానూ సేవలందించారు. జిల్లాలో బంధువర్గమున్న కోటారెడ్డి టీడీపీని వీడటం ఆ పార్టీకి దెబ్బేనని భావిస్తున్నారు.

చేరిక కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం రామకోటారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల ప్రయోజనాలకోసం వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటం అభినందనీయమని, ఆయన ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తానే కాదు, ప్రజలంతా గట్టిగా విశ్వసిస్తున్నారని అన్నారు.

రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన కాంగ్రెస్‌తో సీఎం చంద్రబాబు జతకట్టి రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని, అందువల్లనే తాను పార్టీలో చేరానని చెప్పారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాల కార్యక్రమం పట్ల ఆకర్షితులమై తన తండ్రితోపాటు వైఎస్సార్‌సీపీలో చేరామని ఆయన తనయులు కేతిరెడ్డి కళాధర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాల్ని చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఎన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో ఆయనకు భంగపాటు తప్పదన్నారు. ఏ పల్లెకు వెళ్లినా నిన్ను ‘నమ్మం బాబూ...’ అంటూ నినదిస్తున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top