స్టార్‌.. స్టార్‌.. ‘ట్రోలింగ్‌ స్టార్‌’..

Social Media Locks in The State is Playing 'Troling Star' Lokesh Babu - Sakshi

సాక్షి, అమరావతి : స్టార్‌.. స్టార్‌.. ‘ట్రోలింగ్‌ స్టార్‌’.. ఇంతకీ ఈ ట్రోలింగ్‌ స్టార్‌ ఎవరంటే? .. ఇంకెవరు.. చినబాబు లోకేశే..! ఎందుకంటే అందరికంటే ఎక్కువుగా సోషల్‌ మీడియాలో లోకేశ్‌ మీదే ఎక్కువ జోక్స్, సెటైర్లు పేలుతున్నాయి మరి. సోషల్‌ మీడియా అన్నది రెండువైపులా పదునున్న కత్తివంటిది. ట్విట్టర్‌లో ఎక్కువమంది ఫాలోయర్స్‌ ఉండటం ఓ రాజకీయ నేతకున్న జనాదరణకు నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీకి ఎక్కువమంది ఫాలోయర్స్‌ ఉండటం ఇప్పటికే పలుసార్లు మీడియాలో వచ్చింది.

ఇక తెలివితక్కువుగా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నేతలను సోషల్‌ మీడియా  ఆటపట్టించి నవ్వులు పూయిస్తోంది. ఆ మాటలను ఎద్దేవా చేస్తూ కామెంట్లతోపాటు గ్రాఫిక్స్, కార్టూన్లు కూడా జోడిస్తూ హాస్యాన్ని పండిస్తున్నారు. దీన్నే ట్రోలింగ్‌ అంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్‌ మీడియా లోకేశ్‌ను ‘ట్రోలింగ్‌ స్టార్‌’గా ఆటపట్టిస్తోంది. ఎందుకంటే  తాజాగా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేసే క్రమంలో మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని  బయటపెట్టుకున్నారు.

‘వైఎస్‌ జగన్‌ సీఎం అయితే బందరు పోర్టును కేసీఆర్‌ తెలంగాణాకు తీసుకుపోతారు’అని అనడంతో అందరూ అవాక్కయ్యారు. అసలు పోర్టును ఎవరైనా మరో చోటకు ఎలా తీసుకువెళ్తారని అంతా నవ్వుకున్నారు. పోనీ తెలంగాణలో కూడా సముద్రం ఉంటే.. బందరు వద్ద ఏర్పాటు చేయాల్సిన పోర్టును అక్కడ కాకుండా తెలంగాణా రాష్ట్రంలో ఏర్పాటుకు అక్కడ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాజకీయ ఆరోపణ చేయొచ్చు. కానీ అసలు తెలంగాణాలో సముద్రమే లేదు. మరి బందరు పోర్టును కేసీఆర్‌ తెలంగాణాకు ఎలా తీసుకువెళ్తారు..!? అది అసాధ్యం.. కానీ ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా లోకేశ్‌ విమర్శించి అడ్డంగా దొరికిపోయారు. 

నిజానిజాలతో నిమిత్తం లేకుండా..
అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హవాను అడ్డుకునేందుకు ఆయనపై దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు పన్నాగం. వైఎస్‌ జగన్, కేసీఆర్‌ ఒకటేననే అసత్య ప్రచారాన్ని పెద్దఎత్తున తీసుకువెళ్లాలని కుతంత్రం రచించారు. తన తండ్రి ఓ అసత్య ప్రచారాన్ని జోరుగా వినిపిస్తున్నారు కదా.. తాను అదే విధంగా చేయాలని భావించారు. అందుకే నిజానిజాలతో నిమిత్తం లేకుండా ‘వైఎస్‌జగన్‌ గెలిస్తే బందరు పోర్టును కేసీఆర్‌ తెలంగాణకు తీసుకుపోతారు’అని విమర్శించి తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. అదే తడువుగా సోషల్‌ మీడియా లోకేశ్‌ను ఓ ఆట ఆడుకుంది. దాంతో టీడీపీ శిబిరం ఒక్కసారిగా మౌనం వహించాల్సి వచ్చింది. ఈ విషయంలోనే కాదు గతంలో కూడా చాలాసార్లు లోకేశ్‌ ఇదే విధంగా అవగాహనలేమితో మాట్లాడి సోషల్‌ మీడియాకు దొరికిపోయారు.

గతంలో అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న సందర్భాలు.

  • అంబేడ్కర్‌ జయంతిని వర్థంతి అని అనడంతో అందరూ అవాక్కయ్యారు. 
  • వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైతే తాము పరవశించామని ఆయన అనడంతో అంతా బిత్తరపోయారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా అని విమర్శలు వెల్లువెత్తాయి. 
  • తాజాగా మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తూ ఏప్రిల్‌ 9న జరిగే పోలింగ్‌లో తనకు ఓటేయాలని అనడంతో అందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఎందుకంటే పోలింగ్‌ ఏప్రిల్‌ 11న జరగనుంది. కనీసం పోలింగ్‌ తేదీ ఎప్పుడో కూడా తెలీకుండా లోకేశ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని సోషల్‌ మీడియాలో లోకేశ్‌ మీద పెద్ద ఎత్తున జోకులు పేలాయి. 
  • మంగళగిరి నియోజకవర్గంలో తాను 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని లోకేశ్‌ చెప్పడంతో కూడా సెటైర్ల వర్షం కురిసింది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఓట్లే 2.32 లక్షలు. ఆ నియోజకవర్గంలో కనీసం ఎందరు ఓటర్లున్నారో కూడా తెలుసుకోకుండానే ప్రచారం చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. దీంతో లోకేశ్‌కు  ‘ట్రోలింగ్‌ స్టార్‌’ అని నెటిజర్లు నిక్‌నేమ్‌ పెట్టారు. లోకేశ్‌తో పాటు ట్రోలింగ్‌ స్టార్‌ బిరుదు కోసం పోటీపడుతున్న నేత మరొకరు ఉన్నారు... ఆయనే కేఏ పాల్‌... మరి ఎన్నికలు ముగిసేనాటికి లోకేశ్, కేఏ పాల్‌లలో ఎవరు ఎక్కువుగా తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుని ట్రోలింగ్‌ స్టార్‌ బిరుదును దక్కించుకుంటారో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ‘ట్రోలింగ్‌ స్టార్‌ ’ మాత్రం నిస్సందేహంగా లోకేశే.. అని నెటిజర్లు చెప్తున్నారు.  

– వడ్దాది శ్రీనివాస్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top