రాహుల్‌ గాంధీ ప్రవర్తన నచ్చకే...: ఎస్‌ఎం

SM krishna comments on rahul gandhi over  constant interference - Sakshi

బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేంద్ర మాజీమంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ ప్రవర్తన నచ్చకే తాను మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. నిన్న మాండ్యలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీలో 80ఏళ్లు దాటిన వృద్ధులను కేబినెట్‌ నుంచి తొలగించాలంటూ రాహుల్‌ అభిప్రాయం వ‍్యక్తం చేయడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు కేబినెట్‌పై ఏమాత్రం అధికారం లేదని, అధికారం మొత్తం రాహుల్ చేతుల్లోనే ఉండేదని ఎస్ఎం కృష్ణ విమర్శించారు.

దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు.  పదేళ్ల క్రితం రాహుల్‌ ఎంపీగా మాత్రమే ఉన్నారని, ఆయన ఎలాంటి పార్టీ పదవులు చేపట్టకపోయినా... అన్ని విషయాల్లో తలదూర్చేవారని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండానే రాహుల్ పలు నిర్ణయాలు తీసుకునేవారని ఎస్ఎం కృష్ణ వ్యాఖ్యానించారు. దేశానికి మరో అయిదేళ్లు నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని అభిప్రాయపడిన ఆయన..మోదీ సర్కార్‌లో ఎలాంటి అవినీతి, కుంభకోణాలు జరగలేదన్నారు.  గత ఎన్నికల్లో అధికారం కోల్పోయాక కూడా రాహుల్ పెత్తనం తగ్గలేదని, అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా ఎస్ఎం కృష్ణ 2017 మార్చిలో బీజేపీలో చేరిన విషయం విదితమే.

మరోవైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ యువ నాయకత్వం కోసం పార్టీలోని సీనియర్‌ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని మరోసారి స్పష్టం చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top