సీఎం బామ్మర్ది అయితే! 

Shivraj Singh Chouhans brother in law to fight against BJP - Sakshi

వారాసివనిలో దూకుడుమీదున్న బీజేపీ 

కాంగ్రెస్‌ అభ్యర్థిగా చౌహాన్‌ బావమరిది 

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వారాసివని నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే యోగేంద్ర నిర్మల్‌నే బీజేపీ మళ్లీ బరిలో దించింది. మాములుగా అయితే ఈ స్థానంపై పెద్ద ఆసక్తేమీ ఉండదు. కానీ.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బావ (మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్‌)కు హ్యాండిచ్చి.. కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ తెచ్చుకున్న సంజయ్‌ సింగ్‌ మసానీ బీజేపీపై పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. వృత్తిరీత్యా వైద్యుడైన మసాని వారాసివని నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని భావించారు. అయితే, అధిష్టానం ఆయనకు టికెట్‌ నిరాకరించింది. దీంతో మసాని ఈ నెల 3వ తేదీన కమల్‌నాథ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కమల్‌నాథ్‌ కృషి ఫలితంగా కాంగ్రెస్‌ నాలుగో జాబితాలో మసానీకి చోటు దక్కింది. 

బావ పార్టీపై బామ్మర్ది ఆగ్రహం 
బీజేపీలో బంధుప్రీతి హద్దులు దాటిందని, వారసులకే పెద్ద పీట వేస్తున్నారని 60 ఏళ్ల మసాని మండిపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు, కూతుళ్లకే ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చౌహాన్‌ కంటే కమల్‌నాథ్‌ అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే, మసానీకి టికెట్‌ ఇవ్వడం పట్ల కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మసానీ అక్రమాలను పలుమార్లు కాంగ్రెస్‌ పార్టీయే అసెంబ్లీలో ఎత్తిచూపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి మద్దతుగా ఎలా ప్రచారం చేయాలని ప్రశ్నిస్తున్నారు. 

ఆరెస్సెస్‌ బలమెక్కువ 
మధ్యప్రదేశ్‌లో బాలఘాట్‌ జిల్లా పరిధిలోకి వచ్చే వారాసివనిలో.. 2013లో ఆరెస్సెస్‌ మద్దతుతో బీజేపీ అభ్యర్థి యోగేంద్ర నిర్మల్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రదీప్‌ జైస్వాల్‌పై 17,755 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2008లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి  జైస్వాల్‌ గెలిచారు. 10మంది పోటీలో ఉన్నా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నప్పటికీ బీఎస్పీ కూడా తీవ్రమైన పోటీనిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top