ప్రజలే వారికి బుద్ధి చెబుతారు

Sharad Pawar fights over BJP-backed MLAs - Sakshi

బీజేపీకి మద్దతిచ్చిన ఎమ్మెల్యేలపై శరద్‌ పవార్‌ మండిపాటు

న్యూఢిల్లీ/సాక్షి,ముంబై: అజిత్‌ పవార్‌తోపాటు అతని వెంట ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ మండిపడ్డారు. ఎన్సీపీలో అంతర్గత పోరుతోనే అజిత్‌ బయటకు వెళ్లారన్నది అవాస్తవమన్నారు. బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌తో హడావుడిగా గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించడం చట్ట విరుద్ధమంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. గవర్నర్‌ నిర్ణయాన్ని రద్దు చేయాలని, తక్షణమే శాసనసభను రద్దు పరిచి, బల పరీక్ష జరిపించాలని కోరాయి. ఈ పిటిషన్‌ ఆదివారం ఉదయం 11.30 గంటలకు విచారణకు రానుంది.

మా వాళ్లంతా తిరిగి వస్తారు: పవార్‌
ఆకస్మిక రాజకీయ పరిణామాలపై శనివారం ఉదయం ఆయన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకార సమయంలో అక్కడున్న 10–11 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ మా వద్దకు వచ్చారు. మిగతా వారూ వస్తారు’ అని శరద్‌ తెలిపారు. అజిత్‌ చర్య క్రమశిక్షణారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ‘అజిత్‌తోపాటు వెంట ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఫడ్నవీస్‌ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవడం ఖాయం. అజిత్‌ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ప్రజలే ఓడిస్తారు’అని అన్నారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ కూటమికి అసెంబ్లీలో 170 మంది సభ్యుల బలముంది’ అని అన్నారు.

బీజేపీవి చీకటి రాజకీయాలు: ఉద్ధవ్‌
తాజా పరిణామాలపై ఉద్ధవ్‌ స్పందించారు. ‘శివసేన ఏదైనా బాహాటంగానే చేస్తుంది. చీకటి రాజకీయాలు మేం చేయం. ఇదివరకు బీజేపీ ఈవీఎం వ్యవహారం నడిపించింది. ఇప్పుడు ఇదో కొత్త నాటకం. ఇకపై ఎన్నికలు కూడా అవసరమని నేను అనుకోను. సర్జికల్‌ స్ట్రైక్స్‌ సమయంలో మాదిరిగానే కేంద్ర కేబినెట్‌ ఉదయాన్నే తీసుకున్న ఈ నిర్ణయం నకిలీస్టైక్స్‌(ఫర్జికల్‌ స్టైక్స్‌).  మహారాష్ట్ర ప్రజలు శిక్షించక తప్పదు’ అని ఉద్ధవ్‌ పేర్కొన్నారు.

ఇదో చీకటి అధ్యాయం: కాంగ్రెస్‌
మహారాష్ట్రలో అక్రమ మార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని, భారతదేశ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయమని కాంగ్రెస్‌ విమర్శించింది. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కాంట్రాక్టు పుచ్చుకున్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌–ఎన్సీపీ–శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేసింది. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌–శివసేన–ఎన్సీపీ కూటమి బీజేపీని ఓడిస్తుందని పేర్కొంది.

ఉదయం సుప్రీం విచారణ
ఫడ్నవీస్‌తో సీఎం ప్రమాణం చేయిస్తూ గవర్నర్‌ కోష్యారీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎమ్మెల్యే బేరసారాలకు మరింతగా అవకాశం ఇవ్వకుండా వెంటనే శాసనసభలో బల నిరూపణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం  ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

అజిత్‌ పవార్‌పై వేటు
ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్‌ పవార్‌ను ఆ పార్టీ తొలగించింది. ఎన్సీపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపినందున అతన్ని తొలగించినట్లు తెలిపింది. దీంతో విప్‌జారీచేసే అధికారం అజిత్‌ కోల్పోయారని తెలిపింది. శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎన్నికయ్యే వరకు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ రాజ్యాంగపర హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఈ సమావేశానికి మొత్తం 54 మందికిగానూ 49 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి బలం నిరూపించుకునేందుకు ఈ నెల 30 వరకూ సమయం ఉందని, అందులో బీజేపీని ఓడించి శివసేన–కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ చెప్పారు.  ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌ల ప్రమాణ స్వీకారం సమయంలో రాజ్‌భవన్‌లో ఉన్న తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తుదకు శరద్‌ పవార్‌ వద్దకు చేరడం గమనార్హం.

ఎప్పుడేం జరిగింది ?
దేవేంద్ర ఫడ్నవీస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగాæ ప్రమాణం చేయడానికి ముందు రాత్రి నుంచి జరిగిన పరిణామాలివీ...

నవంబర్‌ 22
8:00 (రాత్రి)    ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నేతల భేటీ
8:45–9:00    భేటీ మధ్యలోనే వెళ్లిపోయిన అజిత్‌ పవార్‌
10:00–10:30    ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌
11:30–11:50    బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న అజిత్‌

నవంబర్‌ 23
12:00 (అర్ధరాత్రి):    తెల్లవారేసరికి ప్రమాణ స్వీకారం ముగుస్తుందని కీలక వ్యక్తులకు సమాచారమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్‌
12:15–12:40: ఢిల్లీ వెళ్లే పర్యటనను రద్దు చేసుకున్న మహారాష్ట్ర గవర్నర్‌ బీఎస్‌ కోష్యారీ. ఉదయం ఆయన ప్రయాణం కావాల్సి ఉంది.
12:30: రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శిని కోరిన కోష్యారీ
2:30–2:45:    రాష్ట్రపతి పాలన ఎత్తివేసే పత్రాలు తయారు చేయడానికి రెండు గంటలు పడుతుందని చెప్పిన గవర్నర్‌ కార్యదర్శి. ఉదయం ఏడున్నర గంటలకల్లా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సూచన.
5:30: రాజ్‌భవన్‌ చేరుకున్న అజిత్, ఫడ్నవీస్‌
5:47: రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ప్రకటించిన గవర్నర్‌
7:50: ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్‌ కోష్యారీ. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ల ప్రమాణ స్వీకారం.
8:45: ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌లను అభినందించిన ప్రధాని మోదీ.  
8.50: ప్రమాణస్వీకారం బయటికి తెలియడంతో శరద్‌ పవార్‌ నివాసం ‘సిల్వర్‌ ఓక్‌’ వద్దకి చేరుకున్న ఎన్సీపీ నేతలు
9.00: ఉద్దవ్‌ ఠాక్రే నివాసస్థానం మాతోశ్రీ, శరద్‌ పవార్‌ నివాసస్థానం సిల్వర్‌ ఓక్‌ల వద్ద భారీ పోలీసు బందోబస్తు.
10.10: బీజేపీ ఎమ్మెల్యేలందరూ ముంబైకి రావాలని ఆదేశాలు  
10.30: శరద్‌తో భేటీ అయిన నవాబ్‌ మాలిక్‌
11:00: హోటల్‌ మరీన్‌ ప్లాజాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల భేటీ  
12.30: వైబీ చవాన్‌ సెంటర్‌లో శరద్‌ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రేల మీడియా సమావేశం
1.50:తాను ఇప్పుడేమీ చెప్పలేనని సరైన సమయంలో అన్ని విషయాలు చెప్తానన్న అజిత్‌
2.30: తమ ఎమ్మెల్యేలను సురక్షిత స్థలాలకు తరలించాలని కాంగ్రెస్‌ నిర్ణయం
సాయంత్రం 5.15: సోదరుడు శ్రీనివాస్‌ పవార్‌ నివాసంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్‌ భేటీ. పటిష్ట భద్రత ఏర్పాటు.
6.20: సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన.
రాత్రి 8.00 అజిత్‌పై వేటు వేసిన ఎన్సీపీ

నవంబర్‌ 24
ఉదయం 11.30: పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top