హమ్‌ ‘ఆప్‌’కే హై కౌన్‌?

 Senior Leaders Quitting APP over kejriwal dominance - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రంగాల్లోని ప్రముఖులు తమ బంగారు భవిష్యత్తును వదులుకొని అరవింద్‌ కేజ్రివాల్‌ నాయకత్వంలోని ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)’లో చేరుతున్నారంటూ ఒకప్పుడు వార్తలు వెలుబడ్డాయి. ఇప్పుడు అదే పార్టీ నుంచి ప్రముఖులు బయటకు పోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలా పార్టీ వీడి బయటకు వెళ్లిపోతున్న వారిలో తాజాగా అశుతోష్, అశిష్‌ కేతన్‌లు చేరారు. అవినీతి రొంపిలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థలో ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించడం కోసం ఆవిర్భవించిన ఆప్‌ పార్టీ నుంచి వారు ఎందుకు వెళుతున్నారు? పార్టీలో వారికి నచ్చని అంశాలేమిటీ? వారు చెప్పిన అంశాలేమిటీ?

కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు: అశుతోష్‌
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కుల సమీకరణల కోసం తన ఇంటి పేరును ఉపయోగించేందుకు ఆప్‌ పార్టీ ప్రయత్నించిందని, అది తనకు నచ్చలేదని అశుతోష్‌ చెప్పారు. 2019లో ఢిల్లీ నుంచి పోటీ చేయబోతున్న ఆతిషి మార్లెనా ఇంటి పేరు క్రైస్తవ పేరుగా ఉన్నందున ఆ ఇంటి పేరును తొలగించాల్సిన పార్టీ తాజాగా సూచించిన నేపథ్యంలో నాడు తనకు ఎదురైన అనుభవాన్ని అశుతోష్‌ ఇప్పుడు ప్రస్తావించారు. ‘23 ఏళ్ల నా జర్నలిజం చరిత్రలో ఎవరు కూడా నా కులం గురించి గానీ, నా ఇంటి పేరు గురించి కానీ ఎవరూ ఏనాడు అడగలేదు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నేను వారిస్తున్నా వినకుండా ఓటర్లకు నన్ను ఇంటి పేరుతో పరిచయం చేశారు. మీ నియోజక వర్గంలో మీ కులపోళ్లు ఎక్కువగా ఉన్నారు. వారి మద్దతు సమీకరించకపోతే నీవెలా గెలుస్తావంటూ నాడు పార్టీ నన్ను ప్రశ్నించింది’ అని అశుతోష్‌ ఈ రోజు ఉదయం ట్వీట్‌లో తెలిపారు.

పార్టీలో ప్రజాస్వామ్యం లేదు: షాజియా ఇల్మీ
ఎప్పుడూ స్వాతంత్య్రం గురించి మాట్లాడే ఆప్‌లోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఎప్పుడో పార్టీ నుంచి బయటకు పోయిన షాజియా ఇల్మీ ఆరోపించారు. కేవలం ధర్నాలకే పరిమితం కాకుండా ఆప్‌ చేయాల్సింది ఎంతో ఉందని, అసలు పార్టీకి ఓ దిశ దశ అంటూ లేదని ఆమె విమర్శించారు.

కేజ్రివాల్‌ ఆశ వల్లనే పార్టీ దెబ్బతిన్నది: మయాంక్‌ గాంధీ
జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించాలనే ఆశ అరవింద్‌ కేజ్రివాల్‌లో ఏర్పడడం వల్లనే పార్టీ దెబ్బతింటూ వచ్చిందని పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరై బయటకు వెళ్లిపోయిన మయాంక్‌ గాంధీ చెప్పారు. ‘ఆశయాలు, పారదర్శకతపై పార్టీ 2013 ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత 2015 ఎన్నికల్లో పార్టీకి 67 సీట్లు వచ్చాయి. ప్రధాని మోదీకి 31 శాతం ఓట్లు రావడంతో మిగిలిన 69 శాతం ఓట్లను సమీకరించుకొని జాతీయ స్థాయిలో పెద్ద పాత్ర పోషించవచ్చని కేజ్రివాల్‌ భావించారు. ప్రతిపక్షాలన్నింటిని కూడగట్టుకొకి మహా కూటమిని ఆయన ఏర్పాటు చేయాలనుకున్నారు’ అని తెలిపారు.

కనీసం మానవత్వం కూడా లేదు: మధు భండారి
‘ఆప్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అసలు లేదు. కనీసం మానవత్వం కూడా లేదు. నేను ఒక్క మానవత్వం గురించే మాట్లాడుతా. మహిళలు కూడా మానవులే. కానీ పార్టీలో మహిళలు మానవులుగానే చూడలేదు’ అని పార్టీ నుంచి బయటకు వెళ్లిన రైటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి మధ భండారి వ్యాఖ్యానించారు.

విసిగిపోయాను: కెప్టెన్‌ జీఆర్‌ గోపీనాథ్‌
‘పార్టీ ఎత్తుగడలు, తంత్రాలతో విసిగిపోయాను. పోరాట పంథా కూడా నచ్చలేదు. పార్టీ ఎత్తుగడుల్లో తప్పులు చేస్తున్నప్పుడల్లా హెచ్చరిస్తూ వచ్చాను. ఎంతకు మార్పు కనిపించకపోవడంతో విసిగిపోయి బయటకు వచ్చాను’ అని ఒకప్పుడు ఆప్‌లో ప్రముఖుడైన కెప్టెన్‌ గోపీనాథ్‌ చెప్పారు. అశుతోష్‌ పాటు తాజాగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఆశిష్‌ కేతన్‌ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇప్పటి వరకు పార్టీ నుంచి బయటకు పోయిన వారంతా అరవింద్‌ కేజ్రివాల్‌ ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తారని పరోక్షంగా ఆరోపించారు. హమ్‌ ‘ఆప్‌’కే హై కౌన్‌ అని కేజ్రివాల్‌ను ప్రశ్నించే వారు బయటకు వచ్చారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top