కొడంగల్‌లో ఉద్రిక్తత...!

Section 144 in the Kodangal constituency - Sakshi

నేటి సీఎం సభకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు 

బంద్‌కు పిలుపునిచ్చిన రేవంత్‌ 

నియోజకవర్గంలో 144 సెక్షన్‌ 

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌కు మరో మూడు రోజులే సమయం ఉండటంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య కోల్డ్‌వార్‌ సాగుతోంది. తమ అనుచరుల ఇళ్లపై ఐటీ దాడులు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలపై నిఘా, తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మంగళవారం నియోజకవర్గ బంద్‌కు పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. ఇదే రోజున కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌ వచ్చే రోజున బంద్‌కు పిలుపునివ్వడం, ఈ సభలో అల్లర్లు సృష్టించేందుకు రేవంత్‌ కుట్ర పన్నుతున్నారంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ డీజీపీ మహేందర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అన్నపూర్ణను ఆదేశించారు. సభకు జనం రాకుండా ఆటంకపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. 

వేధిస్తున్నందువల్లే..! 
కొడంగల్‌లో తనను ఓడించాలని కంకణం కట్టుకున్న టీఆర్‌ఎస్‌ అధికార బలంతో తనపై, తన అనుచరులపై దాడులు చేయిస్తున్నారని రేవంత్‌ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సభలో నిరసన తెలపాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో పాటు బంద్‌కు పిలుపునివ్వడాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. రేవంత్‌పై రెండు నెలల కింద ఐటీ, ఈడీ దాడులు చేయించడమే కాకుండా ఇటీవల బొంరాస్‌పేట కాంగ్రెస్‌ జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మహ్మద్‌ యూసుఫ్, బొంరాస్‌పేట మండల నేత రాంచంద్రారెడ్డి ఇళ్లపై ఐటీశాఖ అధికారులు దాడులు చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి మూడు రోజుల కింద రాత్రి వేళలో రోడ్డుపై బైఠాయించారు. 

అడుగడుగునా భద్రత.. 
కోస్గిలో మంగళవారం కేసీఆర్‌ సభ ఉండటం, కొడంగల్‌ బంద్‌కు రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో ఎన్నికల కమిషనర్‌ రజత్‌కుమార్‌ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు అడుగడుగునా భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొడంగల్, కోస్గి వెళ్లే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారులలో కొడంగల్, కోస్గిలకు వెళ్లే ప్రధాన రహదారులలో తనిఖీలు ముమ్మరం చేశారు. కొడంగల్‌ సెగ్మెంట్‌లో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించినట్లు ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్‌ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top