పల్నాడులో టీడీపీ నీచ రాజకీయాలు! | Sakshi
Sakshi News home page

పల్నాడులో టీడీపీ చిచ్చు!

Published Wed, Sep 11 2019 9:48 AM

Sattenapalli YSRCP MLAs Protest Against TDP Leaders Kodela Shiavaprsad And Srinivasa Rao - Sakshi

సాక్షి, అమరావతి, గుంటూరు : నిన్నటి వరకూ అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, కే–ట్యాక్సులతో అట్టుడికిన పల్నాడు ప్రాంతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రశాంతంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రపూరితంగా ప్రశాంత పల్నాడులో చిచ్చుపెట్టే చర్యలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి వంతపాడుతూ నీచ రాజకీయాలకు తెరదీశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు పల్నాడులో సాగించిన ఫ్యాక్షన్‌ రాజకీయాలను విస్మరించి, ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ దిగజారుడు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. యరపతి నేని శ్రీనివాసరావు, కోడెల కుటుంబం పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలతో నష్టపోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఆత్మకూరు వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్, రూరల్‌ ఎస్పీ ఆర్‌.జయలక్ష్మిని మంగళవారం కలిసి వినతిపత్రాలు అందజేశారు.

‘‘ సత్తెనపల్లిలో గొడుగుల సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన 17 ఎకరాల పొలాన్ని కోడెల కుమారుడు లాగేసుకున్నాడు. కోళ్లఫారాన్ని ఆక్రమించి అక్కడ ఉన్న కోళ్లు తిన్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతనిని ఊరు విడిచిపెట్టి వెళ్లాని కోడెల శివరామ్‌ బెదించాడు. అప్పుడు మేము వెళ్లి సుబ్బారావును సత్తెనపల్లి రావాలని పిలిస్తే అతను భయపడి రాలేదు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఇక్కడకు వచ్చి పొలాన్ని తీసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాడ’ని’  ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో ఓ హోటల్‌లో చంద్రబాబు దొంగ నాటకాలపై మంత్రి మోపిదేవి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించారు. టీడీపీ పాలనలో బాధితులను తీసుకుని ఆత్మకూరు వెళ్ళాలని నిర్ణయించారు.

గుంటూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయల్దేరేలా కార్యచరణ రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రితో కలిసి ఆయన మాట్లాడారు. సత్తెనపల్లిలో అచ్చయ్య అనే వ్యక్తి నుంచి స్కూల్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ కోసం కోడెల కుటుంబం రూ. 20 లక్షలు వసూలు చేసిందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి రూ. 10 లక్షలు ఇచ్చారని తెలిపారు. అక్రమ మైనింగ్‌పై ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్సీ టీజీవీ.కృష్ణారెడ్డిపై కేసులు బనాయించారని, గురువాచారిని చిత్రహింసలు పెట్టారని గుర్తు చేశారు. ఇలా అరాచకపాలన సాగించారు. అందుకే భాదితులతో కలిసి ఆత్మకూరు వెళుతున్నామని, వీరందరికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని, కోడెల బాధితులకు డబ్బులు  ఇప్పించాలని కోరారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, దుర్గి, గురజాల ప్రాంతాల్లోని బాధితులంతా గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయానికి వస్తారని, వారందరితో కలిసి ఆత్మకూరుకు వెళతామని తెలిపారు. యరపతినేని, కోడెల, పుల్లారావు, జీవీ ఆంజనేయులు చాలా ఆరాచకాలకు అంతు లేదన్నారు.

బాబు పెయిడ్‌ ఆర్టిస్టులతో రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన  రాజకీయ హత్యలను మంత్రి మోపిదేవి వెంకటరమణరావు సాక్ష్యాలతో వివరించారు. అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కలిసి ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకటరోశయ్య, షేక్‌ ముస్తఫా, మేరుగ నాగార్జున, వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌ గాంధీ, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్‌ సీపీ నేతలు కావటి మనోహర్‌నాయుడు, డైమండ్‌బాబు, పానుగంటి చైతన్య, టీడీపీ బాధితుడు గొడుగుల సుబ్బారావు, అచ్చయ్య పాల్గొన్నారు.

రాజకీయాల కోసం పల్నాడులో చిచ్చుపెట్టొద్దు
పల్నాడు ప్రజలు అభివృద్ధి, శాంతి గురించి ఆలోచిస్తున్నారని, రాజకీయాల కోసం చిచ్చుపెట్టొద్దని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హితవు పలికారు. వరికపూడిసెల, గురజాలలో వైద్యశాల, నరసరావుపేటలో జేఎన్‌టీయూ కాలేజీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఐదేళ్లల్లో బాబు దొంగ దీక్షలు, దొంగ హామీలతో కాలం గడిపారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసే 23 సీట్లతో పక్కన పెట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా, అంబటి రాంబాబులపై దాడి చేస్తే అప్పుడు న్యాయం ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టి వేధించారని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపై దాడి చేయించారని తెలిపారు.
– శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ, నరసరావుపేట

టీడీపీ పాలనలో గ్రామాలు విడిచి వెళ్లారు
తెలుగుదేశం పాలనలో అనేక మంది గ్రామాలు విడిచి, గుంటూరులో కూలీలుగా మారారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తిరిగి గ్రామాలను వచ్చారని తెలిపారు. బొల్లాపల్లిలో ఇద్దరు అన్నదమ్ములను చంపారని గుర్తు చేశారు. తన ఫ్యాక్టరీ మూయించి, తనను జీపులో ఎక్కించారని, 72 ఏళ్ల మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై రేప్‌ కేసు పెట్టించారని, ఇవన్నీ దారుణాలు కావా అని ప్రశ్నించారు.
– బొల్లా బ్రహ్మనాయుడు , వినుకొండ ఎమ్మెల్యే

కోడెల, యరపతినేనిని తీసుకురావాలి
టీడీపీ ఐదేళ్ల పాలనలో ఐదుగురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఛలో ఆత్మకూరుకు తాము తెలుగుదేశం పార్టీ బాధితులతో కలిసి వస్తామని, చంద్రబాబు మాత్రం కోడెల కుటుంబం, యరపతినేనిని తీసుకొస్తే చాలని పేర్కొన్నారు. ఐదేళ్లల్లో  ఏం జరిగిందో, మూడు నెలల్లో ఏం జరిగిందో చర్చిద్దామని బాబుకు సవాల్‌ విసిరారు.
– గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే 

Advertisement
Advertisement