
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వ్యతిరేకి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీనిచ్చిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వర్గీకరణపై అసెంబ్లీలో మాట్లాడకుండా సీఎం కేసీఆర్ మాదిగల గొంతునొక్కుతున్నారని విమర్శించారు.
వర్గీకరణ డిమాండ్ చేస్తున్న మంద కృష్ణను జైల్లో పెట్టడం అప్రజాస్వామికమని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను గద్దె దించేది మాదిగ జాతేనని అన్నారు. మాదిగ ప్రజాప్రతినిధులంతా శుక్రవారం సమావేశం అవుతున్నట్టుగా చెప్పారు. సీఎం కేసీఆర్ రాజకీయ అంతమో, వర్గీకరణ పంతమో తేల్చుకుంటామని సంపత్ హెచ్చరించారు.