రిటర్నింగ్‌ అధికారిపై వేటు

RK Nagar Returning Officer Removed After Actor Vishal's Nomination Row - Sakshi

సాక్షి, చెన్నై:  తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్  అధికారిపై వేటు పడింది.  ప్రముఖ నటుడు విశాల్ కృష్ణ నామినేషన్ వ్యవహారంలో  వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా స్పందించింది. విశాల్‌ నామినేషన్‌ ఉదంతంపై   ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పత్రాలను తిరస్కరించిన  అధికారి వేలుస్వామిని  ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. ఈయన స్థానంలో ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ పీ నాయర్‌ని   నూతన రిటర్నింగ్‌ అధికారిగా నియమించింది.

హీరో విశాల్‌ నామినేషన్‌ తిరస్కరణపై ప్రతిపక్ష డిఎంకె నేత స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. విశాల్ నామినేషన్‌ను తిరస్కరించే విషయంలో భారత ఎన్నికల కమిషన్ పాలక పార్టీతో కుమ్ముక్కయిందని ఆయన ఆరోపించారు.   రిటర్నింగ్‌ అధికారిని వెంటనే తొలగించాలని  డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు అధికార పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

కాగా ఆర్కే నగర్  అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాల్  సమర్పించిన నామినేషన్ అసంపూర్తిగా ఉందని రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం విదితమే. అయితే కొంత సమయం అనంతరం నామినేషన్‌  అంగీకరిస్తున్నట్టు, మళ్లీ తిరస్కరించినట్టు ప్రకటించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. విశాల్‌ అభిమానుల మితిమీరిన ఒత్తిడి మూలంగానే నామినేషన్‌ను ఆమోదించినట్లు అధికారి చెప్పడం మరింత వివాదానికి తెర తీసింది.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top