సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తుండడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి గురువారం బీజేపీ ఫిర్యాదు చేసింది.
అజారుద్దీన్ మంత్రి పదవి అంశంపై తెలంగాణ బీజేపీ బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీఈవోతో జరిగిన భేటీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ లీగల్ టీం పాల్గొంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నియామకాన్ని Model Code of Conduct (MCC) ఉల్లంఘనగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ అంశంపై బీఆర్కే భవన్ వద్ద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మంత్రివర్గ విస్తరణకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే పదవి కి పోటీ చేశారు. ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ అంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్లే. ఒక వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఆ వర్గం ప్రజలు ఇది గమనించాలి. కేవలం ఓట్ల కోసమే ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మినిస్ట్రీ ఇస్తున్నారు. ఎన్నికల లబ్ధి కోసమే మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ పాల్పడుతోంది. సీఎం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన విషయంలో సంబంధిత అధికారులకు ఈసీ నోటీసులు ఇవ్వాలి’’ అని అన్నారు..
పాయల్ శంకర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఉల్లంఘించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ ఉండగా...ప్రకటన చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే. ఎలక్షన్ కోడ్ ఉండగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కోడ్ ఉల్లంఘించడమే. ఒక వర్గం ఓటర్లతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొక పది రోజులు ఆగితే మోడల్ కోడ్ కండక్ట్ ముగిసిపోతుంది కదా!. 20శాతం వర్గం మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను 80శాతం వర్గం ప్రజలు గమనిస్తున్నారు. CEO మంత్రి వర్గ విస్తరణ ను ఆపాలని కోరాం. జూబ్లీహిల్స్ ప్రాంత ఓటర్లకు ప్రభావితం చేసే ఏ నిర్ణయం తీసుకోవద్దు అని అన్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
మరోవైపు ఈ అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమేనని అన్నారాయన.
ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపదమొక్కులు మొక్కుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనం. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. అందుకే కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సరైన వేదిక అని కేటీఆర్ అన్నారు. అయితే అజారుద్దీన్ వ్యవహారంపై ఈసీని ఆశ్రయించే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
I guess desperate times call for desperate measures 😁
After 2 years in Govt, looks like Congress party is finally waking up to ground realities
Promising the moon to cine workers, inducting Azharuddin in cabinet and ministers desperately running around in Hyderabad Gullies…— KTR (@KTRBRS) October 30, 2025
మాజీ ఎంపీ, గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్.. ఈ ఉప ఎన్నిక బరిలో నిలబడతారనే ప్రచారం ఉధృతంగా సాగింది. అయితే అనూహ్యంగా ఆయన్ని గవర్నర్ కోటా ద్వారా MLCని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో అజారుద్దీన్ నేడో, రేపో మంత్రిగా ప్రమాణం చేస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఉంటే.. ఎలక్షన్ కోడ్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారానికి ఈసీ అనుమతిస్తుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో?? చూడాలి.


