పవన్‌ను ఉద్దేశించి వర్మ సెటైర్స్‌

Ram Gopal Varma Satires On Pawan Kalyan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేనాని పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ ఇవి ఎవరన్నారో తెలుసా? అని ఆయన పేరు ప్రస్తావించకుండా దెప్పిపొడిచారు. ‘జగన్‌ నువ్వేలా సీఎం అవుతావో చూస్తా?, జగన్‌ చిన్న కోడికత్తికే గింజుకున్నారు, తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు, రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా, నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడు?, జగన్‌ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతా, 2 లక్షల పుస్తకాలు చదివా, 32 మార్కులతో 10 పాసయ్యా, మా అన్నయ్య కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోతే సాక్షిలో నీచంగా రాశారు.(ఆమె వెళ్లిపోయింది 2007లో అయితే సాక్షి పేపర్‌ 2008 మార్చిలో ప్రారంభమైంది)’ అని అవగాహన రాహిత్యంగా పలు సందర్భాల్లో పవన్‌ చేసిన వ్యాఖ్యలను వర్మ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది జనసేనాని, మెగా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా జగన్‌ సీఎం ఎలా అవుతారో చూస్తానన్న పవన్‌ కల్యాణ్‌ రేపు విజయవాడలో జరిగే ప్రమాణస్వీకారానికి వస్తే కనబడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడన్న పవన్‌ కల్యాణ్‌ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని ఎద్దేవా చేస్తున్నారు.

ఇక గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆయన ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లకు సైతం వైఎస్‌ జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు.

  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top