టీఆర్‌ఎస్‌ ఓడితే మోదీ బి టీమ్‌ ఓడినట్టే!

Rahul Gandhi Slams TRS And BJP In Khammam Public Meeting - Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఏర్పడిన​ ప్రజా కూటమి దేశానికే దిక్సూచి వంటిదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నిలకు తెలంగాణ భవిష్యత్‌ కోసమే కాదని యావత్‌ దేశ భవిష్యత్‌ కోసమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో ప్రజాకూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌, బీజేపీలపై నిప్పులు చెరుగుతూనే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు. ఈ సభకు రాహుల్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట​ ఇంఛార్జ్‌ కుంతియా, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు హాజరయ్యారు. రాహుల్‌ ప్రసంగాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క తనదైన రీతిలో అనువాదం చేసి ఆకట్టుకున్నారు. రాహుల్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వ్యవస్థలను నాశనం చేశారు
‘ప్రధాని నరేంద్ర మోదీ.. సీబీఐ, సుప్రీం కోర్టు, ఎలక్షన్‌ కమిషన్‌ వంటి అనేక వ్యవస్థలను నాశనం చేశారు. నోట్ల రద్దు, గబ్బర్‌ సింగ్‌ ట్యాక్‌, రాష్ట్రపతి ఎన్నికలు, అవిశ్వాస తీర్మాన సమయాల్లో టీఆర్‌ఎస్‌ బీజేపీకి బహిరంగంగా మద్దతిచ్చింది. కానీ వీటన్నింటికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాడింది. ప్రజా కూటమిలోని పార్టీలన్ని కలిసి బీజేపీ కూటమి అయిన టీఆర్‌ఎస్‌ను ఓడిద్దాం. తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ఓడిపోతే మోదీ బి టీమ్‌ ఓడినట్టే.. ఆ తర్వాత ఢిల్లీలోని ఏ టీమ్‌ను ఓడిద్దాం. టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి మద్దతిస్తున్నా.. మోదీ మాత్రం తెలంగాణ అభివృద్దిని పట్టించుకోలేదు. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బలంగా కోరుకుంటున్నాయి. తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కూటమి గెలవబోతోంది.

రీడిజైనింగ్‌లో పేరిట వేల కోట్ల ఖర్చు
గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం 50వేల కోట్లతో ప్రణాళిక రూపిందించింది. కానీ టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినందుకే అదనంగా 43 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు రీడిజైనింగ్‌ పేరుతో కేసీఆర్‌ కాలం వెల్లదీస్తున్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ అంటూ పాత వాటికే రంగులు అద్దుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు 17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉంది. కానీ నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పులు చేసింది. దీంతో ఒక్కొక్కరిపై  60వేల భారం పడుతుంది. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికి తప్పా ఎవ్వరికీ ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ ఖజానాను కేసీఆర్‌ కుటంబం, బినామీలు, సన్నిహితులు దోచుకుంటున్నారు. 

విభజన హామీలు నెరవేర్చలేదు
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఖాజీపేట్‌లో రైల్వే కోచ్‌, బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌, గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండు రాష్ట్రాలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. విభజన హామీలు నెరవేర్చేది కేవలం కాంగ్రెస్‌ మాత్రమే. బీజేపీకి కేసీఆర్‌ మద్దతిస్తున్నా.. మోదీ మాత్రం తెలంగాణ ప్రజల అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తున్నారు. బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను అడగండి.  కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ది అని ప్రజలు గుర్తించండి’ అంటూ రాహుల్‌ గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top