పొత్తులు తేలాకే అభ్యర్థుల ప్రకటన: ఉత్తమ్‌

Rahul Gandhi Kurnool District Tour Schedule Released - Sakshi

సాక్షి, కర్నూలు‌: టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో మంగళవారం కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటన అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం వైపల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తారా లేక పొత్తుపై వ్యాఖ్యలు చేస్తారా అని అటు కాంగ్రెస్‌ నేతలకు, ప్రతిపక్ష పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కర్నూలు పర్యటన పార్టీకి ఉపయోగపడే విధంగా తయారు చేశారు.

గత నెలలో ఏఐసీసీ అధ్యక్షుడి హైదరాబాద్‌ పర్యటన విజయవంతం కావడంతో అదే రీతిలో ఇక్కడా విజవంతం చేయాలని స్థానిక నేతలు భావిస్తున్నారు. విద్యార్థులతో, రైతులతో, కాంగ్రెస్‌ దివంగత నేతల కుటుంబ సభ్యులతో రాహుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను, కార్యకర్తలను తరలించాలని ఏపీసీసీ భావిస్తోంది. 

కర్నూలుకు ఉత్తమ్‌
కర్నూలు జిల్లాలో రాహుల్‌ పర్యటనలో పాల్గొంటున్నానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల కమిటీ నియామకం రాహుల్‌ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. త్వరగా కమిటీలు వేయాలని ఏఐసీసీని కోరుతున్నానని వివరించారు, పొత్తుల అంశం, సీట్ల కేటాయింపు విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని తెలిపారు. పొత్తుల అంశం తేలకుండా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమి విషయంలో ప్రాథమిక చర్చలే జరిగాయని, ఉమ్మడి ఎజెండా ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనేది అందరితో చర్చించి నిర్ణయిస్తామన్నారు. అభ్యర్థుల ప్రకటన స్ర్కీనింగ్‌ కమిటీ పరిధిలో ఉందన్నారు. పొత్తులో గెలిచే సీట్లను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

రాహుల్‌ పర్యటన వివరాలు:
మంగళవారం మధ్యాహ్నం 12.15 గం.లకు స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా రాహల్‌ గాంధీ చేరుకుంటారు. అనంతరం నేరుగా మాజీ సీఎం దామోదర సంజీవయ్య ఇంటికి చేరుకొని అయన కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు. అనంతరం బైరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో పలు విషయాలపై చర్చించనున్నారు. విద్యార్థులతో చర్చా గోష్టి అనంతరం దివంగత సీఎం విజయ్‌ భాస్కర్‌ రెడ్డి సమాధి(కిసాన్‌ ఘాట్‌) వద్దకు చేరుకొని పుష్పాంజాలి ఘటిస్తారు. అనంతరం  దివంగత సీఎం కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించనున్నారు. అక్కడే రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం స్థానిక ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top