టీడీపీ కుట్రలన్నీ చిత్తుచిత్తు | Public Provoked To The Religious Tensions By TDP Through Social Media | Sakshi
Sakshi News home page

టీడీపీ కుట్రలన్నీ చిత్తుచిత్తు

Aug 30 2019 4:09 AM | Updated on Aug 30 2019 10:44 AM

Public Provoked To The Religious Tensions By TDP Through Social Media - Sakshi

సాక్షి, అమరావతి : ఓవైపు ప్రజా సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మరోవైపు అసత్య ప్రచారాలు, పెయిడ్‌ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురదజల్లుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం. తెలుగుదేశం సాగిస్తున్న దుష్ప్రచారం వెనుక దాగి ఉన్న అసలు గుట్టు ఎప్పటికప్పుడు బయట పడుతుండడం, ఆ పార్టీ నేతల దందాలు, అవినీతి బాగోతాలు వెలుగు చూస్తుండడంతో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మూడోస్థానం దక్కించుకోవడం ప్రజాభిప్రాయానికి నిదర్శనంగా నిలుస్తోంది. 

ఆ బస్సు టిక్కెట్లు బాబు సర్కారు నిర్వాకమే 
ప్రజల్లో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, పబ్బం గుడుపుకోవడానికి టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది. తిరుమల, శ్రీశైలంలో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు సోషల్‌ మీడియా వేదికగా కుయుక్తులు పన్నింది. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక హజ్, జెరూసలేం యాత్రలకు సంబంధించిన ప్రకటనలు ఉండటాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆ టిక్కెట్లు ముద్రించారని ఆధారాలతో సహా బయట పడడంతో టీడీపీ కుట్రలు చెల్లాచెదురయ్యాయి.

శ్రీశైలం దేవస్థానంలో అన్య మతస్తులను చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే నియమించారని దేవాదాయ శాఖ రికార్డులే తేల్చిచెప్పాయి. దాంతో తెలుగుదేశం పార్టీ ఇక నోరు మెదపలేకపోయింది. అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జ్యోతి ప్రజ్వలన చేయలేదని బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్‌ ఆరోపించారు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేయాలని యత్నించారు. కానీ, అమెరికాలో ఆ ప్రాంతం ఫైర్‌ రిస్ట్రిక్ట్‌ జోన్‌ కాబట్టే అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయడం సాధ్యం కాలేదని నిర్వాహకులు ప్రకటించడం కుట్రదారులకు చెంపపెట్టుగా మారింది. 

శ్రీవారి సొమ్ముతో చంద్రబాబు డాబు 
ఢిల్లీలో శ్రీవారి ఉత్సవాల నిర్వహణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసిన నిధులను దారిమళ్లించారని టీడీపీ మరో తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది. కాగా, శ్రీవారి ఉత్సవాల కోసం కేటాయించిన రూ.5 కోట్లను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఢిల్లీ పర్యటనలు, దీక్షలకే ఖర్చు చేశారని టీటీడీ స్పష్టం చేసింది. దీంతో టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది.

బెడిసికొట్టిన బురద రాజకీయం 
కృష్ణా నదికి వరదలు రాగానే టీడీపీ బురద రాజకీయానికి తెరతీసింది. వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో రైతులుగా పేర్కొన్నవారు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను కించపరుస్తూ దూషించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆ వీడియోలో ఉన్నవారు నిజానికి రైతులు కారని, వాళ్లు టీడీపీ ఎన్నికల ప్రచార చిత్రాల్లో నటించిన జూనియర్‌ ఆర్టిస్టులన్న నిజం బయటపడింది. ఆ వీడియో చిత్రానికి నిర్మాతలు టీడీపీ నేతలేని తేటతెల్లమైంది.

కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు ఉంటున్న ఇల్లు సక్రమమేనన్న టీడీపీ వాదన కృష్ణా వరదలతో బెడిసికొట్టింది. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరడంతో ఆయన ముందుగానే హైదరాబాద్‌కు పలాయనం చిత్తగించారు. వరదల తీవ్రతను డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయబోయి బొక్కబోర్లా పడింది. తెలంగాణలో ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీచార్జీ చేస్తే, అది ఏపీలో జరిగిందంటూ టీడీపీ సాగించిన అసత్య ప్రచారం నిలువునా నీరుగారిపోయింది. కేరళలో ఓ దేవస్థానం వద్ద పోలీసు అధికారి లాఠీచార్జీ చేస్తే, అది తిరుమల ఆలయం వద్ద జరిగిందంటూ టీడీపీ విసరబోయిన పాచిక పారలేదు. 

టీడీపీ నేతల అక్రమాలు బట్టబయలు 
చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు సాగించిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆ పార్టీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం గుంటూరు జిల్లాలో కొనసాగించిన దందాల బాగోతం తెరపైకి రావడం, అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఆయన తన సొంత కార్యాలయానికి తరలించడం విస్మయానికి గురిచేసింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని గుంటూరు జిల్లాలో సాగించిన అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామ వాలంటీర్ల నియామకాలను అడ్డుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం తిప్పికొట్టింది. నిరుద్యోగులపై చంద్రబాబు మొసలి కన్నీరు కార్చాలని చూడగా, సీఎం వైఎస్‌ జగన్‌ ఒకేసారి 4.15 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో టీడీపీ నోటికి తాళం పడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement