బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన తప్పదా!

President Rule Be Imposed In West Bengal! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చినికి చినికి గాలి వానలా మారినట్లు పశ్చిమ బెంగాల్‌లో పార్టీ జెండాలు, బ్యానర్ల విషయంలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ప్రారంభమైన తగువు తుపాకులు పట్టుకొని పరస్పరం కాల్చుకునే పరిస్థితికి దారితీసింది. ఇరువర్గాల మధ్య గత పక్షం రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 13 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలుకాగా, ఐదుగురు తణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి 24 పరగణాల జిల్లా ఉత్తరాదిలోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి ఇంతటితో తెరదించకపోతే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జాతి విద్వేషాలు రగులుకునే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. 

బంగ్లాదేశ్‌కు సరిహద్దులో ఉన్న ఈ జిల్లాలో 2017, 2010లో హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. బీహార్‌ నుంచి జార్ఖండ్‌ నుంచి వచ్చిన వలసదారులు స్థానిక బెంగాలీలను స్థానభ్రంశం చేశారని తణమూల్‌ మంత్రి ఒకరు ఆరోపించడం అంటే జాతి విద్వేషాలకు అవకాశం ఇవ్వడమే. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ పార్టీని కమ్యూనిష్టులు సవాల్‌ చేసినప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో, 2000 సంవత్సరంలో కమ్యూనిస్టులను, మమతా బెనర్జీ సవాల్‌ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు మమతా పార్టీని బీజేపీ సవాల్‌ చేస్తున్నప్పుడు కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఏర్పడిందని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 

అధికారంలో ఉన్న పార్టీగా అల్లర్లను అరికట్టాల్సిన బాధ్యత తణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువగా ఉంది. మమత అధికార యంత్రాంగం కూడా పార్టీ లాగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి తీవ్రమైంది. ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను అరికట్టడం చేతకాక బెంగాల్‌ పోలీసులు చేతులు కట్టుకు కూర్చున్నారని అనడంకన్నా వాటిని ఆపడం ఇష్టంలేక మిన్నకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లను గెలుచుకున్న ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కూడా అల్లర్లను అరికట్టేందుకు బాధ్యత తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి తీవ్రమవడం, కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించడం తప్పదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top