ప్రకాశంలో టీడీపీకి బిగ్ షాక్‌

Prakasam TDP Leaders Join In YSRCP - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నేతలంతా వరుస పెట్టి వెళ్లిపోతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. కేడర్‌ డీలా పడిపోయింది. అరకొరగా ఉన్న నేతలకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జ్‌లతో పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో గట్టెక్కేదెలా..? అంటూ జిల్లా టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఆ పార్టీ నేతలు వరుస పెట్టి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండడంతో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత  వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో  ఉన్న క్యాడర్‌ కాస్తా డీలా పడిపోయింది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక టీడీపీ నేతలు మరింత ఆందోళన చెందుతున్నారు. కోట్లు కుమ్మరించి ఓటమి చెందాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. అదే జరిగితే రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.

తూర్పు, పశ్చిమల్లోనూ గడ్డు పరిస్థితే..
ఇప్పటి వరకు తూర్పు ప్రకాశంలో బలంగా ఉన్నామని అధికార టీడీపీ భావిస్తూ వచ్చింది. ప్రధానంగా పర్చూరు, చీరాల, అద్దంకి నియోజకవర్గాలతో పాటు మరి కొన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు.  పర్చూరు నుంచి దగ్గుబాటి కుటుంబం, చీరాల సిటింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి వైఎస్సార్‌ సీపీలో చేరడంతో టీడీపీ ఆ సీట్లపైనా ఆశలు వదులుకుంది. అద్దంకి నియోజకవర్గంలో అటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం కుటుంబం అధికార పార్టీలోనే ఉన్నా ఇక్కడ వైఎస్సాసీపీ బలంగా తయారవుతోంది. ఒంగోలులో పార్టీ తిరుగులేని శక్తిగా మారింది.

మాజీ మంత్రి, పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తనదైన శైలి వ్యూహాలతో దూసుకువెళ్తుండడంతో టీడీపీ దరిదాపుల్లోకి రాలేకపోతోంది. ఇక్కడ టీడీపీలో అసంతృప్తులు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇక పశ్చిమ ప్రకాశం పరిధిలోని అన్ని సీట్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి తిరుగులేదన్నది పరిశీలకుల అంచనా. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి చేరికతో కందుకూరులో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని టీడీపీలోని ఓ వర్గమే పేర్కొంటుండం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిల్లో జిల్లాలోని 12 స్థానాల్లో వైఎస్సాసీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
 
చంద్రబాబు సర్కారుపై ప్రజాగ్రహం..
ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీని కుదిపేస్తోంది. అభివృద్ధి పథకాలు ప్రధానంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా ఆగిపోవడం, సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కమిషన్‌లు ఇచ్చే వారికే దక్కుతుండడంతో ప్రజల్లో మరింత వ్యతిరేక వ్యక్త మవుతోంది. రైతు రుణమాఫీ సక్రమంగా అమలు జరగక పోవడం, డ్వాక్రా రుణమాఫీ హామీని చంద్రబాబు పక్కన పెట్టడం, కౌలు రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందక పోవడంతో అన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని ప్రతికూలాంశాల మధ్య టీడీపీ నుంచి పోటీ చేయడం సాహసంగానే మారిందని కొందరు అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top