
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మించిన దొంగ, అవినీతిపరుడు, వెన్నుపోటుదారుడు ఎవరూ లేరన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మండిపడ్డారు. తాను నిర్మించిన సినిమా ఏమిటో తెలుసుకోకుండా ఎవరో తెలుగుదేశం అభిమాని ఫిర్యాదు చేస్తే రాజ్యాంగ వ్యవస్థలోని ఓ పెద్ద సంస్థైన ఎన్నికల సంఘం తనను వ్యక్తిగతంగా హజరు కమ్మని నోటీసు ఇవ్వడమేమిటని ప్ర శ్నించారు. చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఆయన్నూ వ్యక్తిగతంగా పిలిపిస్తారా? నిజానిజాలేమిటో తెలుసుకోరా? అని నిలదీశారు. చంద్రబాబు మళ్లీ గెలిస్తే వచ్చేది కమ్మ రాజ్యం, కమ్మ రాష్ట్రం, కమ్మ సామ్రాజ్య మేనని ధ్వజమెత్తారు. అధికారం కోసం ఏమైనా చేసే చంద్రబాబు..సాక్షాత్తు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ లాంటి మహానుభావుణ్ణే చంపించారని, అట్లాంటి వ్యక్తికి వైఎస్ జగన్ లాంటి వాళ్లు ఓ లెక్కా అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి గారూ.. మీరు మాటిచ్చారు..
భారత దేశ ఓటర్లందరికీ ఉపయోగపడే సినిమా ’ముఖ్యమంత్రి గారూ..మీరు మాటిచ్చారు’ అనే సినిమా తీశానని పోసాని చెప్పారు. ‘ఈ సినిమా పోస్టర్‌లో ఏముంటుందంటే ప్రజల్ని చైతన్యవంతం చేసేలా.. ఓటును డబ్బుతో కొనేవాడు కుక్కతో సమానం, మద్యం పంపిణీ చేసేవాడు పందితో, కులం కార్డు ఉపయోగించే వాడు లోఫర్‌తో, వెన్నుపోటు పొడిచే వాడు బ్రోకర్‌తో, నీతితో సేవ చేసేవాడు దేవుడితో సమానం అని ఉంటుంది. ఒక వ్యక్తినో, పార్టీనో దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీయలేదు. ’ఆపరేషన్ దుర్యోధన’ మాదిరిగా ఎవరి గెటప్‌లు లేకుండా తీశా. ఈ సినిమా ఏమిటో తెలుసుకోకుండానే చిత్తూరుకు చెందిన మోహన్‌రావు అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడట. ఆ సినిమాను ఆపమన్నాడట. ఇంతవరకు తొలి ప్రతి బయటకు కూడా రాకుండానే నేనేదో చంద్రబాబును తిట్టడానికి ఈ సినిమా తీశానని ఆ అనామకుడు ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది.
ఎన్టీఆర్‌పై సినిమా తీస్తే ..ఆయన ఏమన్నాడో తెలుసా..
‘ఎన్టీఆర్‌పై మండలాధ్యక్షుడు వంటి సినిమా తీశారు. సార్, మీ గెటప్ వేసి సినిమా తీశారని ఆయనకు ఎవరో చెబితే, అవునా, అచ్చం నాలాగే చేశారట కదా అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. నాయకుడంటే ఆయన. మంచి మనిషి లక్షణం అంటే అదీ’అని పోసాని చెప్పారు. ‘ఎన్నికల సంఘం తీరు నచ్చలేదు. నేను సినిమా తీస్తున్నట్టు చెప్పలేదు. అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఆ మోహనరావు అనే వ్యక్తి రాసిన సినిమా టైటిల్‌కు నా సినిమాకు సంబంధం లేదని మర్యాదగా నేను సమాధానం ఇస్తే మార్కండేయులు అనే జాయింట్ సెక్రటరీ తిరిగి లేఖ రాస్తూ నన్ను ఈనెల 20న అమరావతిలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి స్వయంగా వచ్చి సంజాయిషీ ఇమ్మంటాడు. అసలు నేను ఎందుకు రావాలి? అని పోసాని ప్రశ్నించారు.
నిజాయితీగా ఉంటే భయం ఎందుకు?
‘నేను తీసిన సినిమా చంద్రబాబుపైన కాదు. ఎన్నికల ప్రణాళికకు సంబంధించినది. ముఖ్యమంత్రికీ, ఒక సామాజిక కార్యకర్తకు మధ్య జరిగే సంభాషణ ఇది. ముఖ్యమంత్రిగా చాలా సార్లు ప్రమాణం చేశారు కదా, ఎన్నికల ప్రణాళికలో చాలా వాగ్దానాలు చేశారు, మీరెందుకు నెరవేర్చలేదు? అని ప్రశ్నిస్తా ఉంటే మధ్యలో ఒక రైతు వచ్చి రుణమాఫీ చేయకపోవడం వల్ల ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, అదే చేసి ఉంటే బతికి ఉండే వాడని చెబుతూ ఓ లేఖ రాస్తాడు. ఆ లేఖను పట్టుకుని సామాజిక కార్యకర్త కోర్టుకు వెళతాడు. అదీ కధ. ఇందులో ఏ వ్యక్తినో, పార్టీనో, రాష్ట్రాన్నో పేర్కొనలేదు. సినిమాను విడుదల చేయాలో వద్దో నిర్ణయించేది ఎన్నికల సంఘం కాదు..సెన్సార్ వాళ్లు. వాళ్లు నిర్ణయిస్తారు. ఎన్నికల సంఘం చేయాల్సిన పనేనా ఇది? ఇదే మాదిరిగా వ్యవహరిస్తే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా.అని పోసాని హెచ్చరించారు.