పోలింగ్‌ శాతం పెరగాలి

Polling percentage should rise says KCR - Sakshi

నియోజకవర్గమంతా పర్యవేక్షించాలి 

పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలి 

ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ పార్టీ నాయకులను ఆదేశించారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమన్వయం చేయాలని మంత్రులను ఆదేశించారు. పోలింగ్‌ శాతం పెరిగేలా గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే బాధ్యతలను నిర్వర్తించాలని ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్‌చార్జీలను ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికలు కావడంతో పోలింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉంటుందని... ఈ పరిస్థితిని నివారించేందుకు పార్టీపరంగా గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పోలింగ్‌ వ్యూహంపై పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి ఫోన్‌లో చర్చించారు.

లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధి యూనిట్‌గా మంత్రులు 2 రోజులు పూర్తి బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేయాలని చెప్పారు. ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నేతలతో, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమని... ఓటింగ్‌ శాతం పెరిగితేనే మెజారిటీ వస్తుందని చెప్పారు. ప్రచారం పూర్తి చేసిన తర్వాత సేకరించిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అధినేత 14 లోక్‌సభ సెగ్మెంట్లలో స్వయంగా ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి మినహా అన్ని సెగ్మెంట్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు.  

కేటీఆర్‌ అన్నీ తానై... 
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్లలో ప్రచారంతోపాటు పూర్తిస్థాయిలో ఎన్నికల బాధ్య తలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ మూడు సెగ్మెంట్లలో రోడ్‌ షోలు నిర్వహించారు. నల్లగొండ, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్‌లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ప్రక్రియను సమన్వయం చేస్తూనే ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం నెల రోజులుగా అవిశ్రాంతంగా శ్రమించిన లక్షలాది టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా, పోలింగ్‌ శాతం పెరిగేలా చూడాలని కోరారు.  

వివిధ భాషల్లో వినూత్న ప్రచారం... 
లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వినూత్న ప్రచారం నిర్వహించింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లే లక్ష్యంతో వివిధ భారతీయ భాషల్లో ఎఫ్‌ఎం రేడియోలో ప్రకటనలతో పాటు కరపత్రాలను, పోస్టర్లను విడుదల చేసింది. దీంతో ఇక్కడ ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఆస్కారం ఏర్పడింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top