పోలింగ్‌ ప్రశాంతం

Polling peacefully for assembly elections of Maharashtra, Haryana - Sakshi

మహారాష్ట్రలో 60.46%, హరియాణాలో 65% ఓటింగ్‌

51 స్థానాల ఉప ఎన్నికల్లో దాదాపు 57% ఓటింగ్‌

న్యూఢిల్లీ/చండీగఢ్‌/ముంబై: దేశంలో మినీ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాలకు రెండు పార్లమెంటు స్థానాలకు సోమవారం పోలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. మహారాష్ట్రలో 60.46% మంది, హరియాణాలో 65% మంది తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. క్యూల్లో ఓటర్లు నిలుచుని ఉన్నందున ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. 51 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు 57% పోలింగ్‌ నమోదైందని వెల్లడించింది.

కేరళలో భారీగా వర్షం కురిసినప్పటికీ ప్రజలు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపింది. కాగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటల సమయానికి మహారాష్ట్రలో 60.46% పోలింగ్‌ నమోదైంది. 2014 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో 63.38% పోలింగ్‌ నమోదు కావడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. ముంబైలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతోపాటు వచ్చిన ఓ వృద్ధుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఈ రోజు హీరో ఖన్నా సాబ్‌. ఆర్మీలో పనిచేసిన ఈయన వయసు 93 ఏళ్లు. ఓటేయడానికి వచ్చారు. ఇది అందరికీ స్ఫూర్తినిచ్చే అంశం’ అంటూ ఇరానీ పేర్కొన్నారు.  

హరియాణాలో 65% నమోదు
గత ఎన్నికలతో పోలిస్తే హరియాణాలో ఈసారి తక్కువ మంది ఓటేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 65% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 76.54% కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ 70.36% మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం.

పోలింగ్‌పై ఫిర్యాదులు.. అపశ్రుతులు
ఉల్లంఘనలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ 250 వరకు ఫిర్యాదులు చేసిందని ఎన్నికల సంఘం తెలిపింది. రాంటెక్‌ నియోజకవర్గంలో ఓ వ్యక్తి ఈవీఎంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్తు బటన్‌ నొక్కగా బీజేపీకి ఓటు పడినట్లు చూపినట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పుర్సల్‌ గొండి గ్రామంలో ఎన్నికల విధులకు వెళ్తూ బాపు పాండు గవాడే(45) అనే ఉపాధ్యాయుడు మరణించాడు. భోసారి నియోజకవర్గంలో అబ్దుల్‌ రహీం షేక్‌(62) ఓటేసేందుకు వచ్చి అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచాడు.  

ఉప ఎన్నికల్లో మోస్తరు ఓటింగ్‌
దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 56.84% పోలింగ్‌ నమోదైంది. అతితక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 47.05% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో ముఖ్యంగా ఎర్నాకులంలో భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచినప్పటికీ ఓటర్లు వెనుకంజవేయలేదు. ఇక్కడ  53.27% మంది ఓటేశారు. కేరళలో అత్యధికంగా అరూర్‌లో 75.74% ఓటింగ్‌ నమోదైంది. కాగా, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఖోన్సా వెస్ట్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 90% ఓటింగ్‌ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో 74%, తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో 84% మంది ఓటు వేశారు. తమిళనాడులోని విక్రవండి నియోజకవర్గంలో 84.36%, గుజరాత్‌లో 51%, బిహార్‌లో 49.50% పంజాబ్‌లో 60%, రాజస్తాన్‌లో 66% పోలింగ్‌ నమోదైంది.

వ్యాపార దిగ్గజాలు పోలింగ్‌కు దూరం
టాటా గ్రూప్‌నకు చెందిన రతన్‌ టాటా, ఎన్‌. చంద్రశేఖరన్, అంబానీ సోదరులు, సజ్జన్‌ జిందాల్‌ వంటి వ్యాపార దిగ్గజాలు సోమవారం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే, చాలా ముఖ్యమైన పనుల్లో వారు వేరే ప్రాంతంలో బిజీగా ఉన్నందునే ఓటెయ్య లేకపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా ముకేశ్, అనిల్‌ అంబానీ సోదరులు తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఓటు వేస్తుంటారు. కానీ, ఈసారి వారు రాలేదు. అందుకు కారణాలు కూడా వెల్లడి కాలేదు. సోమవారం పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ వ్యాపార వేత్తల్లో మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో కేకి మిస్త్రీ, మరికో చైర్మన్‌ హర్‌‡్ష మరివాలా, ఎం అండ్‌ ఎం ఎండీ పవన్‌ గోయెంకా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో ఒక ముంబై మహానగరానికి సంబంధించి 38 నియోజకవర్గాలున్నాయి.


ముంబైలో ఓటు వేసిన బాలీవుడ్‌ నటులు ఆమిర్‌ ఖాన్, దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్, సల్మాన్‌ ఖాన్


ఐశ్వర్యారాయ్, అభిషేక్‌ బచ్చన్‌ దంపతులు, ఊర్మిళా మతోండ్కర్, మాజీ క్రికెటర్‌ సచిన్, అంజలి దంపతులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top